Breaking News

అందరు నిబద్ధతతో పనిచేయడం వల్లే కరోనా పారద్రోల‌గలిగాము

నిజామాబాద్‌, మే 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదట్లో నిజామాబాద్‌ జిల్లా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌ తరువాత రెండవ స్థానంలో వుండిరది. ఆశా వర్కర్ల నుండి, హోం గార్డుల‌ నుండి పైస్థాయి అధికారుల‌ వరకు ప్రతి ఒక్కరు ప్రస్తుత పరిస్థితుల్లో నిబద్ధతతో పని చేయడం వ‌ల్ల‌ దాదాపు కరోనాను పారద్రోల‌గలిగామని, జిల్లాలో ఇప్పటివరకు 61 పాజిటీవ్‌ కేసులు రాగా 47 మంది నెగెటివ్‌ రిపోర్టుతో డిశ్చార్జ్‌ అయినారని, మిగిలిన 14 మంది త్వరలోనే డిశ్చార్జ్‌ అవబోతున్నారని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, హౌసింగ్‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో కోవిడ్‌ 19 పరిస్థితులు, ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పథకం తదితర అంశాల‌పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నెల‌ 20వ తేదీ నుంచి ఇప్పటివరకు ఒక్క పాజిటీవ్‌ కేసు కూడా జిల్లాలో నమోదుకాలేదని, త్వరలో కరోన రహిత జిల్లాగా మారడానికి ఇకముందు కూడా ప్రతిఒక్కరు కృషి చేయాల‌ని సూచించారు. కరోనా కట్టడికి ఎటువంటి నిర్లక్ష్యం, నిర్లిప్తత చూపకుండా ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం పరస్పర సహకారంతో పనిచేయాల‌న్నారు. వల‌స కూలీల‌ను ఎటువంటి అవాంతరాలు, ఇబ్బందులు లేకుండా వారివారి గమ్యస్థానాల‌కు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

మొదటి విడత నిజామాబాద్‌ జిల్లాలో 10 వేల‌ 802 మంది వల‌స కూలీల‌ను గుర్తించామని, వారు 19 జిల్లాల‌కు చెందిన వారని, వారివారి ప్రాంతాల‌కు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10 వేల‌ 744 మంది వల‌స కూలీల‌కు ఒక్కొక్కరికి 500 రూపాయలు, 12 కేజీల‌ బియ్యాన్ని మొదటి విడతలో పంపిణీ చేశామని, ఇప్పటివరకు 5 వేల‌ 310 మందికి పంపిణీ పూర్తిచేశామని, మిగిలినవారికి కొనసాగుతుందన్నారు.

351 సెంటర్లలో ఇప్పటివరకు 2 ల‌క్షల‌ 18 వేల‌ 958 మెట్రిక్‌ టన్నుల‌ వరి ధాన్యం సేకరించామని, దీనిలో 2 ల‌క్షల‌ 2 వేల‌ 75 మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యాన్ని అనగా దాదాపు 93 శాతం మిల్లుల‌కు తరలించడం జరిగిందని, 142 కోట్లు చెల్లించామన్నారు. గన్ని బ్యాగుల‌ కొరత లేదని, లాక్‌డౌన్ వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి వీలైనంత తొందరగా మిగిలిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సంవత్సరం ఆరు ల‌క్షల‌ మెట్రిక్ టన్నుల‌ ధాన్యం జిల్లాలో పండిరదని, ఇప్పటికే రెండు ల‌క్షల‌ పైచిలుకు సేకరించామని, మిగిలిన ధాన్యాన్ని రోజు 20 వేల‌ మెట్రిక్‌ టన్నుల‌ చొప్పున 20 రోజుల్లో పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు తదితర ఆరుతడి పంట ధాన్యాల‌ను కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్‌ చేసుకున్న యాక్టీవ్‌ వర్కర్లకు పనిదినాలు కల్పించడం జరుగుతుందని, గత ఏడాది జిల్లాలో ల‌క్షా ఇరవై ఐదు వేల‌ పనిదినాలు కల్పించామని, ఈ ఏడాది ల‌క్షా ముప్పై వేలు ల‌క్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ అదనపు కూలీలు, వాహనాలు సమకూర్చడానికి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే సమస్యలు పరిష్కరించి ప్రతి రైతు వద్ద ధాన్యం కొనుగోలు పూర్తిచేస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్ఠల్‌ రావు, శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల‌ గణేష్‌ గుప్తా, జీవన్‌ రెడ్డి, షకీల్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, అదనపు కలెక్టర్లు బి. చంద్రశేఖర్‌, బి.ఎస్‌. ల‌త, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, వివిధ శాఖ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నగరంలో మన్యం వీరుడి జయంతి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని నిజామాబాద్‌ ...

Comment on the article