Breaking News

లాక్‌డౌన్‌ వేళ మద్యం అమ్మకాలు ఆపివేయాలి

నిజామాబాద్‌, మే 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాల‌ను ఆపివేయాల‌ని ప్రజా సంఘాల‌ (పిఓడబ్ల్యు, పిడిఎస్‌యు, పివైఎల్‌) ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల‌ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ లాక్‌డౌన్ వ‌ల్ల‌ ప్రజల‌ ఉపాధి దెబ్బతిని అనేక రకాల‌ కష్టాల‌ను అనుభవిస్తున్నారని, అయినప్పటికీ కరోనా వ్యాధి కట్టడి కోసం అందరూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు.

45 రోజులు అనేక ఇబ్బందుల‌కు ఓర్చి లాక్‌ డౌన్‌ను జయప్రదం చేసిన ప్రజల‌ ప్రయత్నాన్ని నీరు కారుస్తూ, ప్రభుత్వం మద్యం షాపుల‌కు అనుమతివ్వడం దుర్మార్గమన్నారు. ముఖ్యంగా రెడ్‌ జోన్‌లో కూడా మద్యం అమ్మకాల‌కు అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వం కేవలం ఆదాయం కోసం ప్రయత్నిస్తుంది తప్ప, ప్రజల‌ ఆరోగ్యాల‌ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. మద్యం అమ్మకాలు ప్రారంభమైనప్పటి నుండి లాక్‌ డౌన్‌ క్రమశిక్షణ మొత్తం దెబ్బతిన్నదన్నారు.

మద్యం ప్రియులు విచ్చల‌విడితనం పెరిగిందన్నారు. హింసాయుత ఘటనలు జరుగుతున్నాయన్నారు. మద్యం కొనుగోళ్లలో క్రమశిక్షణ పాటించడం లేదన్నారు. ఇలాంటి నేపథ్యంలో కరోనా విజృంభించడం తేలికవుతుందని, ఇన్నిరోజుల‌ శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మద్యం షాపుల‌ను వెంటనే మూసివేయాల‌ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ప్రజల‌ ప్రాణాల‌తో ఆదాయ మార్గాల‌ను చూసుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల‌ నాయకులు మారుతి, నర్సక్క, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *