Breaking News

ప్రతి జిల్లాకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

నిజామాబాద్‌, మే 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం రైతుకు లాభసాటిగా చేయాల‌న్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అగ్రిక‌ల్చ‌ర్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించిందని, అందుకు అవసరమైన స్థల‌ సేకరణకు ప్రభుత్వ స్థలాలు గుర్తించి రిపోర్ట్‌ సమర్పించాల‌ని జిల్లాలోని రెవెన్యూ అధికారుల‌ను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.

శుక్రవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్‌ల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ కొరకు 600 నుండి 2000 ఎకరాలు, అగ్రిక‌ల్చ‌ర్‌ కాంప్లెక్స్‌ కొరకు 20 ఎకరాల‌ ప్రభుత్వ భూముల‌ను గుర్తించాల‌ని, భూములు రోడ్డు, రైలు మార్గాల‌కు దగ్గరగా ఉండాల‌ని, త్వరగా మనం అవసరమైన భూమి గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లయితే మన జిల్లాకు ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ జోన్‌, అగ్రిక‌ల్చ‌ర్‌ కాంప్లెక్స్‌లు మంజూరు అవుతాయని, ఈ విషయంలో ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ చూపి 4 రోజుల్లో రిపోర్ట్‌ సమర్పించాల‌న్నారు. అగ్రిక‌ల్చ‌ర్‌ కాంప్లెక్స్‌లో 5 వేల‌ మెట్రిక్‌ టన్నుల‌ గోదాములు, కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణం చేస్తారని అలాగే ప్రతి మండల‌ కేంద్రాల్లో 5 ఎకరాలు గుర్తించి మంగళవారం లోపు నివేదిక సమర్పించాల‌ని అన్నారు.

తహసీల్దార్‌లు ధాన్యం సేకరణ వీలైనంత త్వరలో పూర్తి చేయాల‌ని, అలాగే కరోనా వ‌ల్ల‌ గత రెండు నెల‌లుగా పెండిరగ్‌లో ఉన్న రెవిన్యూ శాఖ కు సంబంధించిన పనుల‌న్నీ పూర్తిచేయాల‌ని, తమ తమ మండలానికి సంబంధించిన ప్రతి గుంట స్థలం వదల‌కుండా అట్టి వివరాల‌ను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల‌న్నారు.

ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన భూముల‌ వివరాల‌ను వెబ్‌సైట్‌లో నమోదు చేయాల‌ని, ప్రభుత్వ భూముల‌ను కాపాడటం తహసీల్దార్‌ బాధ్యతని, అందుకు వారికి అన్ని హక్కులు చట్టంలో ఉన్నాయని, ముఖ్యంగా ఇరిగేషన్‌ భూముల‌కు సంబందించిన వివరాలు ఆ శాఖ అధికారులు, తహసీల్దార్‌కు తెలిపి, ధరణి పోర్టల్‌లో నమోదయ్యేలా చూడాల‌ని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌లు సి.చంద్రశేఖర్‌, ల‌త, సంబంధిత శాఖ అధికారులు, తహసీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

‘ఆల‌న’ ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలో అసంక్రమిక ...

Comment on the article