Breaking News

పంచాయతికో సామూహిక మరుగుదొడ్డి

కామారెడ్డి, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చ భారత్‌ మిషన్‌ కింద గ్రామాల్లో ఇంటింటికి టాయ్లెట్‌ నిర్మించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కమ్యూనిటి టాయ్లెట్‌ను నిర్మించాల‌ని నిర్ణయించాయని, గ్రామాల‌కు పనులు చేయడానికి వచ్చే కూలీల‌తో పాటు గ్రామంలోని అన్నీ వర్గాల‌ వారు టాయ్లెట్‌ను వినియోగించుకునేలా నిర్మించనున్నారని కామారెడ్డి డిఆర్‌డివో చంద్రమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇందుకు జిల్లా గ్రామీణాబివృద్ది శాఖ జిల్లాలోని అన్నీ పంచాయతీల‌ నుంచి ప్రతిపాదనలు కోరుతుందని, ముందుకు వచ్చే జీపీలు గ్రామ సభలో తీర్మానం చేసుకొని సంబందించిన మండల‌ అబివృద్ది కార్యాల‌యం ద్వారా జిల్లా శాఖకు ప్రతిపాదనలు పంపేలా మార్గదర్శకాల‌ను కూడా విడుదల‌ చేసిందన్నారు. జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలున్నాయని, చాలా జీపీల‌కు టాయ్లెట్‌ లేని పరిస్థితి కూడా ఉందని, అయితే టాయ్‌లెట్లు లేక ఇతర ప్రాంతాల‌ నుంచి గ్రామాల‌కు వచ్చే కూలీలు, పంచాయతికి వచ్చిన ప్రజలు, జీపీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, దీంతో కమ్యూనిటి టాయ్లెట్లను నిర్మించాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయని స్పష్టం చేశారు.

ఒక్కో దాని నిర్మాణ వ్యయం రూ.2 ల‌క్షలు ఉందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వాటా అందింస్తోందని, మిగితా 10 శాతం నిధుల‌ను మాత్రం సంబందించిన గ్రామ పంచాయతినే భరించాల్సి ఉంటుందన్నారు. అయితే కమ్యూనిటి టాయ్లెట్‌ నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని గుర్తిచడంతో పాటు గ్రామ సభ తీర్మానం కాపీతో పాటు జీపీ వాటాను కలెక్టర్‌ లేదా డిఆర్‌డిఆర్‌ఓకు సంబంధించిన జిల్లా స్వచ్ఛ భారత్‌ ఖాతా సిండికేట్‌ / కెనరా బ్యాంకు 35202250015954 ఖాతాలో జమ చేయాల‌ని శాఖ అదికారులు చెబుతున్నారన్నారు.

మహిళలు, పురుషుల‌కు వేరువేరుగా కమ్యూనిటి టాయ్లెట్‌ను మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా నిర్మిస్తున్నారని, ఇందుకు ప్రత్యేకంగా మ్యాప్‌ను కూడా రూపొందించారన్నారు. నిర్మించే టాయ్లెట్‌లో మూడు మరుగుదొడ్లు నిర్మిస్తుండగా ఇందులో ఒకటి పురుషుల‌కు రెండు మహిళల‌కు ఉన్నాయని, పురుషుల‌ కోసం రెండు యూరినల్స్‌ కూడా ఏర్పాటు చేయనున్నారన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల‌తో గ్రామ పంచాయతీల్లో టాయ్లెట్‌, మరుగుదొడ్ల సమస్య తీరనుందని, సర్పంచులు ముందుకు రావాల‌న్నారు. గ్రామ పంచాయతికి ఒక్కటి చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామూహిక మరుగుదొడ్డిని నిర్మించి ఇస్తోందని, కేవలం 10 శాతం వాటా జీపీ నుంచి కడితే రూ.2 ల‌క్షల‌ వ్యయం గల‌ టాయ్‌లెట్‌ను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు గ్రామ సర్పంచ్‌లు ముందుకు వచ్చి ప్రతిపాదనలు అందించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని చంద్రమోహన్‌రెడ్డి కోరారు.

Check Also

మొక్కజొన్నే గాంధారి ప్రాంత రైతుల‌ జీవనాధారం

గాంధారి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలుగా ఉండడం, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *