Breaking News

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల మేలు కోసమేనని, రైతుకు దెబ్బ తగల‌నీయమని, కీడు జరుగనీయమని, రైతుకు లాభసాటి అయిన వ్యవసాయాన్ని అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామంత్రి వి. ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

గడచిన నాలుగున్నర సంవత్సరాల‌లో ఎవరూ ఊహించని పనులు చేశామని, రెండు సంవత్సరాల‌లో 24 గంటల‌ ఉచిత విద్యుత్‌, 8 వేల‌ నుండి 10 వేల‌ పంట పెట్టుబడి సాయం, ఆన్‌సీసన్‌లో ఎరువులు సమీకరించి రైతుకు సకాలంలో అందించడం, చెరువుల్లో పూడిక తీయడం, ఫీడర్‌ కెనాల్‌ మరమ్మతులు తదితర పనులు పూర్తి చేశామని, ఇప్పుడు రైతుకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ల‌క్మి కెనాల్‌కు 13 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని, హనుమంత రెడ్డి, నవాబ్‌ లిఫ్టు ద్వారానే కాకుండా ఎక్కడెక్కడ సోర్స్‌ ఉంటే అక్కడ చెరువులు నింపామన్నారు. బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో 6 చెక్ డాంలు పూర్తి అయినాయని, 3 కన్స్ట్రక్షన్‌లో ఉన్నాయని, మరో 10 కొత్తగా మంజూరు అయినాయన్నారు. ప్యాకేజీ 21 పనుల‌కోసం 790 కోట్లు మంజూరై పనులు వేగంగా సాగుతున్నాయని, దీనివ‌ల్ల‌ బాల్కొండ నియోజకవర్గంలోని రైతుల‌కు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

దేశంలో పండే వరిలో సగం తెలంగాణాలొనే పండుతుందని, రాష్ట్రంలో సాగులో ఉన్న కోటి 25 ల‌క్షల‌ ఎకరాలో, 53 ల‌క్షల‌ ఎకరాల‌లో పత్తి, 40 ల‌క్షల‌ ఎకరాల్లో వరి, 7 ల‌క్షల‌ ఎకరాల‌లో మొక్కజొన్న, 6 ల‌క్షల‌ ఎకరాల్లో కంది పండుతున్నాయని, మిగిలిన అన్ని పంటలు, కూరగాయలు అన్ని కలిపి మిగిలిన 20 ల‌క్షల ఎకరాల్లో సాగు అవుతున్నాయన్నారు. మోతె క్లస్టర్‌లోని 4640 ఎకరాల‌ సాగుభూమిలో 3094 ఎకరాల‌లో (దొడ్డు బియ్యం – 2100 ఎకరాలు, సన్న బియ్యం – 1000 ఎకరాల్లో) వరి సాగు అవుతోందని, రాబోయే వర్షాకాలంలో 1579 ఎకరాల్లో దొడ్డు బియ్యం, 1515 ఎకరాల‌లో సన్న బియ్యం, 1092 ఎకరాల‌లో సోయా, 47 ఎకరాల‌లో కంది అలాగే 47 ఎకరాల‌లో పెసలు సాగుచేయడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సాగు చేసేందుకు మోతె క్లస్టర్‌లోని అన్ని గ్రామాలు తీర్మానం చేసి సమర్పించాయని, ఇది ఆయా గ్రామాల‌ ప్రజల‌కు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని, తెలంగాణ పోరాట సమయంలోకూడా కేసీఆర్‌కు మద్దతుగా తీర్మానం చేసిన మొట్టమొదటి గ్రామం మోతె అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేసినట్లయితే రైతులు అధిక లాభాలు పొందుతూ, పంటలు ఓపెన్‌ మార్కెట్లో అమ్ముకుని కూడా లాభాలు పొందవచ్చన్నారు.

సమావేశానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, మోతె, రామన్నపేట గ్రామ సర్పంచిలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article