Breaking News

జూన్‌ 1 నుండి పల్లె ప్రగతి

నిజామాబాద్‌, మే 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత చర్యలు చాలావరకు తీసుకున్నారని, రాబోయే వానాకాలంలో ఎటువంటి వ్యాధులు ప్రబల‌కుండా జూన్‌ 1వ తేదీ నుండి 8 వరకు స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రతి గ్రామంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని తహసిల్దార్‌లు, ఎంపీడీవోల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

ప్రతి గ్రామంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల‌ని, వారు గ్రామం అంతా తిరిగి ఈ నెల‌ 31వ తేదీ లోపు నీరు నిలువ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల‌ను గుర్తించి, సమావేశం ఏర్పాటు చేసుకుని స్పెషల్‌ డ్రైవ్‌ కొరకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాల‌న్నారు. గ్రామంలో ప్రతి ఇంటినుండి తడి, పొడి చెత్త సేకరించేందుకు, గ్రామంలోని రోడ్లు, పబ్లిక్‌ ప్లేసులు, స్కూల్స్‌, గ్రౌండ్స్‌, ఖాళీ స్థలాల్లో పోగైన చెత్త చెదారాన్ని తొల‌గించాల‌ని, పనికిరాని, పిచ్చి మొక్కల‌ను తొల‌గించాల‌ని, మురుగు కాలువ‌లు, మోరీల‌లో పోగైన మట్టి, చెత్త, నిలువ ఉన్న నీటిని తొల‌గించాల‌ని అన్నారు.

గుంటల్లో నీళ్లు నిలువకుండా చూడాల‌ని, వర్షం పడ్డ వెంటనే గ్రామ సర్పంచి / వార్డ్‌ కౌన్సిల‌ర్‌, పంచాయతీ సెక్రటరీ, విడిసి మెంబర్లు తదితరులు గ్రామం లేదా వార్డ్‌ మొత్తం తిరిగి నీళ్లు ఎక్కడ నిలువ ఉన్నాయో గమనించి, నీరు నిలువ కాకుండా మట్టి పోయించడం, కాలువ‌లు తీయడం వంటి చర్యలు తీసుకోవాల‌ని చెప్పారు. హరిత హారంలో భాగంగా నాటిన మొక్కల‌ను సంరక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాల‌ని, ఈ సంవత్సరం నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కల‌ను గురించి వాటిని నాటడానికి అనువైన ప్రదేశాల‌ను గుర్తించి, గుంతలు తీసి సిద్ధంగా ఉంచుకోవాల‌ని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం ఒక మీటర్‌ కంటె తక్కువ ఎత్తు ఉన్న మొక్కలు నాటవద్దని అన్నారు. రాబోయే రెండు రోజుల్లో యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాల‌ని, జూన్‌ ఒకటవ తేదీనుంది ఎనిమిదవ తేదీ వరకు షెడ్యూల్‌ ప్రకారం పనులు చేపట్టాల‌న్నారు.

ఆదివారం ఉదయం పది గంటల‌కు 10 నిమిషాల‌పాటు పూల‌ కుండీలు, టైర్లు, డబ్బాలు, కూల‌ర్లు తదితర ప్రాంతాల్లో నిలువ ఉన్న నీటిని పారబోయాల‌ని, ఎటువంటి దోమలు, పురుగులు పెరగకుండా చూస్తే వానాకాలంలో ఎటువంటి వ్యాధులు రాకుండా అరికట్టవచ్చునన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.ల‌త, మండల‌ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article