Breaking News

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం- పది గంటల‌కు- పదినిమిషాలు’’ లో భాగంగా బాన్సువాడ పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. పట్టణ ప్రధాన రహదారి వెంట ఉన్న డ్రైనేజీలోని చెత్త, వ్యర్ధాల‌ను తొల‌గించే పనులు దగ్గరుండి చేయించారు. రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలో షాపులు, హోటల్‌ వ్యాపారులు చెత్త వేయడం చూసి స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెత్తను మురుగు కాలువ‌లో వేయడం ద్వారా మురికి నీరు నిలువ ఉండి దోమల‌ వ్యాప్తి చెంది తద్వారా వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. బాన్సువాడ పురపాల‌క సంఘం ప్రత్యేక వాహనాల‌లో చెత్త సేకరిస్తున్నదని, వ్యాపారులు రోడ్ల మీద, డ్రైనేజీలో వేయకుండా పారిశుద్ధ్య కార్మికుల‌కు అందించాల‌ని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించితే ఆయా వ్యక్తులు, వ్యాపారుల‌పై చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

దీన్నొక సామాజిక కార్యక్రమంగా భావించి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రతి ఆదివారం కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాల‌ని విజ్ఞప్తి చేశారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి లొపలితో పాటు పరిసరాల‌ను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. పరిశుభ్రతతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. పరిశుభ్రంగా ఉంటే సీజన్‌లో వచ్చే అంటువ్యాధుల‌ నుండి కాపాడుకోవచ్చని స్పీకర్‌ అన్నారు.

Check Also

భారీగా కారెక్కారు…

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలానికి ...

Comment on the article