Breaking News

తెలంగాణ ఆవిర్భావంలో టిఎన్జీవోస్‌ భూమిక గొప్పది

నిజామాబాద్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీఎన్జీవో భవన్‌లో టీఎన్జీవోస్‌ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఎన్జీవోస్‌ చేస్తున్న రక్తదాన స్ఫూర్తిని అభినందించారు. సామాజిక సేవ‌లు చేయడం టీఎన్జీవోస్‌కు కొత్త కాదన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ఆవిర్భావంలో వీరి భూమిక ఎంతో గొప్పదని, ఈ విషయం ముఖ్యమంత్రి గారు కెసిఆర్‌ ఎన్నోసార్లు గుర్తు చేశారన్నారు. టీఎన్జీవోస్‌ అంటే ప్రభుత్వంలో భాగమని, మన రాష్ట్రం స్వతంత్రంగా ఏర్పాటై తన కాళ్ళపై తాను నిల‌బడడంలో టీఎన్జీవోస్‌ కృషి కూడా ఉందన్నారు. ఇవాళ తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉందని, ముఖ్యమంత్రి మనసులో రచించుకున్న అనేక పథకాలు తెలంగాణలోని అన్ని వర్గాల‌ ప్రజల‌కు ఉపయోగపడే విధంగా అమలు చేస్తూ జనరంజకమైన పాల‌న అందిస్తున్నారని మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానని అన్నారు.

పేదల‌కు 2016 రూపాయల‌ పెన్షన్‌, డబుల్‌ బెడ్‌ రూము ఇళ్ళు నిర్మించడం ఏ రాష్ట్రంలో అమల్లో లేదన్నారు. సంక్షేమ రంగంలో ఈరోజు తెలంగాణ నెంబర్‌ వన్‌ అని, రైతులు కరెంటు కొరకు పడ్డ బాధలు చూసి వారికి ఉచితంగా 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని, తెలంగాణ నేడు విద్యుత్తు వెలుగుల‌తో నిండుకుందన్నారు. రైతుల‌ను ఆదుకోవాల‌ని పెట్టుబడి సాయం ఇవ్వాల‌న్న ఉద్దేశ్యంతో ఎకరాకి రెండు పంటల‌కు కలిపి సంవత్సరానికి పదివేల‌ రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రైతు చనిపోతే అతని కుటుంబానికి వారంలోపే ఐదు ల‌క్షల‌ రూపాయల‌ బీమా డబ్బు అధికారులు వారింటికి వెళ్లి ఇస్తున్నారని మంత్రి తెలిపారు.

50 సంవత్సరాల‌లో ఎంత అభివృద్ధి జరిగిందో తెలంగాణ వచ్చిన ఆరు సంవత్సరాల‌లో అంత అభివృద్ధి జరిగిందన్నారు. అనేక మైనర్‌, మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు దాదాపుగా పూర్తిచేసుకుని ల‌క్షల‌ ఎకరాల‌కు పంట నీరు అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కాలేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాల‌లో పూర్తి చేసుకొని ప్రపంచ రికార్డు సృష్టించిందని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా పోలీసు కమిషనర్‌ కార్తికేయ, ఎమ్మెల్యే బీగాల‌ గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీలు వి జి గౌడ్‌, రాజేశ్వర్‌, ఆకుల ల‌లిత, జెడ్‌ పి చైర్మన్‌ విట్టల్‌ రావు, డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు అల‌క కిషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

రోజుకు 30 శాంపిల్స్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ పరీక్ష ల్యాబ్‌ (వైరాజీ ...

Comment on the article