Breaking News

రూ. 2.51 కోట్లతో రెండు పడక గదుల‌ ఇళ్ళు

బాన్సువాడ, జూన్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం రాంగంగానగర్‌ గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను, కొల్లూరు గ్రామంలో రూ. 7.50 ల‌క్షల‌తో నూతనంగా నిర్మించిన ఎస్‌సి కమ్యునిటీ హాల్‌ను రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాల‌లో అన్ని వసతుల‌తో రూ. 500 కోట్లతో 5 వేల‌ ఇళ్ళు నిర్మిస్తున్నామన్నారు. మెజారిటీ ఇళ్ళ నిర్మాణం తుది దశకు చేరుకుందని, ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గ పరిధిలో మరో పదివేల‌ ఇళ్ళు నిర్మించి ప్రతి పేదవాడి స్వంత ఇంటి కల‌ నిజం చేస్తామన్నారు. నాయకులు ప్రజల‌కు నిస్వార్థంగా సేవ చేయాల‌ని, పేదల‌ గురించి ఆలోచన చేయాల‌న్నారు.

చేతులెత్తి మొక్కుతున్నా పేదవారికి కెటాయించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ పేరుతో నాయకులు డబ్బు తీసుకోవద్దని, అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గానికి కేటాయించిన కోల్డ్‌ స్టోరేజ్‌ తో కూడిన గోదాంను రాంగంగానగర్‌ గ్రామ సమీపంలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామని, దీంతో ఇక్కడి పేదవారికి ఉపాధి కలుగుతుందని స్పీకర్‌ అన్నారు.

మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ డబుల్‌ బెడ్రూం ఇల్లు పేదల‌ ఆత్మగౌరవ ప్రతీక అని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడలేని విధంగా పేదల‌ కోసం డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తున్నారన్నారు. దసరా నాటికి ల‌క్ష ఇల్లు పేదల‌కు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారని, రెండు ల‌క్షల ఇల్లు నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నాయన్నారు.

ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలో ల‌బ్ధిదారులైన పేదల‌కు 40 గృహాలు అందివ్వడం ఆనందంగా ఉందని, ఇండ్లు మంచి సౌకర్యాల‌తో కట్టించి ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article