Breaking News

రహదారుల‌ అభివృద్ధికి భారీగా నిధులు…

బాన్సువాడ, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా విస్తరించనున్న బాన్సువాడ నుండి తాడ్కోల్‌ వైపు వెళ్ళే రహదారిని ఆదివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ వ్యాపారుల‌తో కలిసి రహదారి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో స్పీకర్‌ మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా అవతరించాక ప్రజల‌ సౌకర్యార్థం రోడ్లను విస్తరించడం, నూతనంగా నిర్మించడం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు.

ఇప్పటికే ప్రధాన రహదారి విస్తరణ పూర్తయి నాలుగు వరుసల‌తో రాష్ట్రంలోనే ఒక మోడల్‌గా ఉందని, అదేవిధంగా పట్టణంలోని తాడ్కోల్‌ చౌరస్తా నుండి ప్రారంభమయ్యే రహదారిపై జుక్కల్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల‌తో పాటు మహారాష్ట్ర వాహనాలు కూడా తిరుగుతున్నాయన్నారు. ఈ మార్గంలో వాహనాల‌ రద్దీ పెరిగిందని, అందుకే తాడ్కోల్‌ చౌరస్తా నుండి పట్టణ సరిహద్దు వరకు సుమారు ఒక కిలోమీటరు వరకు ప్రస్తుతం ఉన్న రహధారిని ఫోర్‌ లైన్‌గా విస్తరిస్తామన్నారు.

సెంట్రల్‌ డివైడర్‌, ఇరువైపులా డ్రైనేజీ, పుట్‌ పాత్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం పురపాల‌క శాఖ ద్వారా రూ. 90 ల‌క్షలు, ఆర్‌అండ్‌బి శాఖ ద్వారా రూ. 2 కోట్లు మంజూరు చేశారని, పూర్తి స్థాయి సర్వే తరువాత అవసరమైతే ఇంకా ఎక్కువ నిధులు కూడా మంజూరు చేయించి రహదారిని అందరి అవసరాల‌కు అనుగుణంగా చక్కగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తు అవసరాల‌కు అనుగుణంగా అందరి ఆమోదంతో రోడ్డు విస్తరించి ప్రజల‌కు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article