Breaking News

రూ.1.51 కోట్లతో 30 రెండు పడక గదుల‌ ఇళ్ళు…

కామారెడ్డి, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో రూ. 1.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 డబుల్‌ బెడ్‌ ఇళ్ళను ప్రారంభించి, ల‌బ్ధిధారుల‌తో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గృహ ప్రవేశం చేయించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల‌ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు అని, దేశంలో కేసీఆర్‌ లాగా 29 రాష్ట్రాల‌లో ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ పేదల‌ కోసం 100 శాతం సబ్సిడీతో రూ. 5.04 ల‌క్షల‌తో అన్ని వసతుల‌తో ఇళ్ళను నిర్మించి ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాల‌లో అన్ని వసతుల‌తో రూ.500 కోట్లతో 5 వేల ఇళ్ళు నిర్మిస్తున్నామని, మెజారిటీ ఇళ్ళ నిర్మాణం తుది దశకు చేరుకుందని స్పీకర్‌ అన్నారు.

నా కల‌, ఆశయం రైతుల‌కు పుష్కలంగా సాగునీరు అందించడం, ఇళ్ళు లేని ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇంటిని నిర్మించడమని పోచారం అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎండిపోయిందని, భవిష్యత్తులో కూడా మంజీరా నది ద్వారా నీళ్లు వస్తాయనే నమ్మకం లేదు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళను నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు తీసుకు వచ్చి ఆయకట్టు భూముల‌కు ఏటా రెండు పంటల‌కు పుష్కలంగా నీరు అందిస్తామని వివరించారు.

ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గ పరిధిలో మరో పదివేల‌ ఇళ్ళు నిర్మించి ప్రతి పేదవాడి స్వంత ఇంటి కల‌ నిజం చేస్తానన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఇప్పిస్తానని పేదల‌ దగ్గర ఎవరైనా నాయకులు డబ్బు తీసుకుంటే వారిని అరెస్టు చేయించి జైలుకు పంపుతామన్నారు. నాయకులు పేదల‌కు నిస్వార్థంగా సేవ చేయాల‌న్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి గారు, నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article