Breaking News

రూ.2.51 కోట్లతో రెండు పడక గదుల‌ ఇళ్ళు ప్రారంభం

బాన్సువాడ, జూన్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ. 2.51 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసరుల్లాబాద్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను ప్రారంభించి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ల‌బ్ధిదారుల‌తో గృహ ప్రవేశం చేయించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్‌ మాట్లాడుతూ కులం, మతం, రాజకీయాల‌కు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.

పేదవారికి స్వంత ఇల్లు దేవాల‌యం వంటిదని, ఇరుకు గదుల‌ ఇళ్ళలో పేదలు తమ ఆత్మాభిమానం చంపుకుని నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డల‌ ఆత్మగౌరవం కాపాడటానికే రెండు పడక గదుల‌ ఇళ్ళని, గత ప్రభుత్వాల‌ హయాంలో ఇళ్ళ సబ్సిడీలో సగం మాత్రమే మాఫీ ఉండేదని, కాని నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో, అన్ని వసతుల‌తో రెండు పడక గదుల‌ ఇళ్ళను నిర్మిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి దయతో బాన్సువాడ నియోజకవర్గంలో అయిదు వేల‌ ఇళ్ళను నిర్మిస్తున్నామని, నియోజకవర్గ పరిదిలోని 110 గ్రామాల‌లో అయిదు వేల‌ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, ఇళ్ళు తీసుకున్న వారు తమ ఇంటితో పాటుగా పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని స్పీకర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమస్తది అనే వారికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిదర్శనమన్నారు. రైతులు అప్పుల పాల‌వ్వకుండా బాధ నుండి బయటకు రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక పథకాల‌ను అమలు చేస్తున్నారని, రైతు బంధు ద్వారా ఎకరాకు ఏడాదికి పదివేల‌ రూపాయల‌ సహాయం, రైతు బీమా ద్వారా ప్రతి రైతుకు రూ. 5 ల‌క్షల‌ భీమా సౌకర్యం, అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, పండిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

గ్రామాల‌లో 90 శాతం రైతులు ఉంటారని, రైతులు ఆనందంగా, సుఖంగా ఉంటే దేశం బాగుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ భగీరధ ప్రయత్నమని, జులై ఆఖరి నాటికి కొండపోచమ్మ సాగర్‌ ద్వారా, వచ్చే ఏడాది నాటికి మ‌ల్ల‌న్న సాగర్‌ ద్వారా నిజాంసాగర్‌ ప్రాజెక్టు లోకి నీళ్లు వస్తాయని పేర్కొన్నారు. రూ. 17 కోట్లతో 100 పడకల‌ సామర్థ్యంతో బాన్సువాడ పట్టణంలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మిస్తున్నామని, బొమ్మన్‌ దేవ్‌ పల్లి చౌరస్తా నుండి గ్రామంలోకి రూ.2.25 కోట్లతో నూతనంగా మరింత సామర్థ్యంతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Check Also

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ...

Comment on the article