Breaking News

జాబ్‌కార్డు లేకున్నా దరఖాస్తులు స్వీకరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాబ్‌ కార్డ్‌ లేని రైతుల‌ దగ్గర నుంచి కూడా రైతు కళ్లాల‌ కోసం దరఖాస్తులు స్వీకరించాల‌ని, వాటిని ఎంపీడీవోల‌కు పంపితే వారు జాబ్‌ కార్డ్స్‌ జారీ చేస్తారని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వ్యవసాయశాఖ అధికారుల‌కు సూచించారు. మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు, ఎంపిడివోలు, ఆయాశాఖల‌ ఇతర అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు.

బుధవారం రైతు వేదికల‌ నిర్మాణాల‌కు శంకుస్థాపనలు చేస్తామని, గ్రామాల‌లో రైతు కళ్ళాల‌కు దరఖాస్తులు చాలా తక్కువగా వస్తున్నాయని, అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ అధికారులు రైతు కళ్లాల‌పై ప్రచారం చేయడం, రైతుల‌కు అవగాహన కల్పించి దరకాస్తు చేసుకునేలా చూడాల‌న్నారు. ఈ నెల‌ 27వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది అన్న విషయం ప్రచారం చేసి ఈ లోపు అన్ని క్లస్టర్లలో వీలైనన్ని ఎక్కువమంది రైతుల‌తో దరఖాస్తు చేయించాల‌న్నారు.

గ్రామాల‌లో పారిశుద్ధ్య పనులు ప్రతి రోజు చేయాల్సిందేనని, ప్రతి పంచాయతీ వర్కర్‌ పారిశుద్ధ్య పనులు చేయాల్సిందేనని, ఎవెరైన తిరస్కరిస్తే వారిని తొల‌గించి వేరేవారిని నియమించుకోవాల‌ని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద గ్రామ వన సేవకుల‌ను నియమించడం, ఈ వారం చివరి లోపు నియమించుకొని ఉదయం 8 గంటల‌ నుండి రెండు గంటల‌పాటు, గ్రామ పారిశుద్య కార్యక్రమాల్లో వినియోగించుకోవాల‌న్నారు.

స్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డు జూన్‌ 30 వ తేదీ లోపు పూర్తి చేయాల‌ని పదే పదే చెపుతున్నా కొన్ని చోట్ల మందకొడిగా సాగుతున్నట్లు తమ దృష్టికి వస్తుందని, నిర్ణయించిన తేదీలోపు పూర్తికాని గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీల‌పై చర్యలు తప్పవన్నారు.

Check Also

చెట్ల పెంపకమే పరిష్కారం

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐటిఐ కాలేజ్‌ గ్రౌండ్‌లో ...

Comment on the article