Breaking News

ఘనంగా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని పి.వి నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఆదివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పి.వి నరసింహారావు శతజయంతి ఉత్సవాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, పోలీసు కమిషనర్‌ కార్తికేయతో కలిసి జ్యోతి వెలిగించి, పి.వి నరసింహారావు చిత్రపటానికి పూల మాల‌ వేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మన తెలుగు బిడ్డ దేశవ్యాప్తంగా తెలుగువారి కీర్తిని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి పి.వి నరసింహారావు అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా చెప్పుకునే పేరు పి వీ నరసింహారావు అని, ఆయన ప్రధాని అయిన తర్వాత వెనక్కి చూసుకుంటే అంతకుముందు తర్వాత ఉన్న భారతదేశం స్పష్టంగా చూడొచ్చు అన్నారు. 1991 లో వారు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచ ఆర్థిక రంగంలో పోటీ పడే విధంగా ఉండేవని, ఆయన గొప్ప ఆర్థిక వేత్త అని, సమాజాన్ని చదివారన్నారు.

సమాజాన్ని ఒక ఒక మానవీయ కోణంలో చూచినప్పుడు ప్రతి అంశం నేర్చుకుని ఆచరించవచ్చు అని వారి యొక్క విధానాల‌ ద్వారా మనము తెలుసుకోవచ్చన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా భారత మాజీ ప్రధాని పి.వి మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాల‌న అందించారన్నారు. తెలుగు వాడిగా ఆయనకు, అంత గౌరవాన్ని సంపాదించి పెట్టిన వారి ఆశయాల‌ను ముందుకు తీసుకు వెళుతూ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి అన్ని రంగాలో అభివృద్ధి సాధించాల‌ని, భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గాని, ప్రపంచ దేశాల‌ సరసన తట్టుకునీ నిల‌బడాల‌న్న వారి ఆశయాల‌ను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మ‌నందరిదని, వారు చూపించిన మార్గంలో ముందుకు సాగాల‌ని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మన వ్యక్తిని ముందు మనం గౌరవించుకున్నపుడే ఎదుటి వ్యక్తులు మనల్ని గౌరవిస్తారని, అంతటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం, గుర్తించుకోవడం గొప్ప విషయమని, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు శతజయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు జరుపుకోవాల‌ని అన్నారు. నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత మాట్లాడుతూ మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, కేంద్రమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులు చేపట్టారన్నారు.

ప్రధానమంత్రిగా రాజీవ్‌ గాంధీ చనిపోయిన తర్వాత సోనియాగాంధీ పదవిని నిరాకరించడంతో మన పివి నరసింహారావుని ప్రధానమంత్రి చేయడం జరిగిందన్నారు. ఆర్థిక అభివృద్ధిలో మన దేశానికి ఎన్నో సేవ‌లు అందించిన ఘనత పి.వి దని, వారు బహు భాషా కోవిదుడు, పన్నెండు వందల‌ ఎకరాల‌ భూమి ఉండి కూడా భూ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత గర్వించదగ్గ విషయం, మన తెలుగు తేజం ప్రధాన మంత్రిగా ఉండి ఎన్నో సేలు అందించాడు. వారిని అభినందించక తప్పదని, ముఖ్యమంత్రి అధికారికంగా శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషదాయకం అన్నారు.

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ మేయర్‌ నీతు కిరణ్‌ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, దేశ ప్రధానిగా సేవలందించిన తెలుగు వాడు పి.వి ఒక్కరు మాత్రమే అని, ఆయన గొప్పతనం గుర్తించి ముఖ్యమంత్రి శతజయంతి ఉత్సవాలు నిర్వహించడానికి, సంవత్సరం మొత్తం వేడుకలు చేయాల‌ని నిర్ణయించడం, మన తెలుగు ప్రధానిని గౌరవించుకోవడం అన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఏవో సుదర్శన్‌, టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు అల‌క కిషన్‌, సెక్రటరీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article