Breaking News

రెండు వేల‌ జరిమానా విధించాలి

నిజామాబాద్‌, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారని, వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమని, వారికి గ్రామస్తులంతా సహకరించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల‌ ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ మండలం ఇందల్వాయి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామములో జరుగుతున్న పారిశుద్ధ్య, వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌, పార్క్‌ స్థలం, నర్సరీ, హరితహారం పనుల‌ను పరిశీలించారు.

మొదట గ్రామంలో తిరిగి పారిశుద్ధ్య పనుల‌ను పరిశీలించి, శానిటేషన్ పనులు సరిగ్గా నిర్వహించడం లేదని సర్పంచ్‌ సెక్రెటరీ శ్రద్ధ తీసుకోవాల‌ని అన్నారు. హరిత హారంలో భాగంగా ఇంటర్నల్‌ రోడ్లకు ఇరువైపుల‌ మొక్కలు ఇప్పటివరకు నాటనందుకు అధికారుల‌పై మండిపడ్డారు. గ్రామంలో కంపోస్టు షెడ్‌, వైకుంఠధామం పనులు మధ్యలో ఆగడంపై సర్పంచ్‌కు నోటీసు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

జూలై 15వ తేదీ వరకు గ్రామంలోని పనుల‌న్నీ పూర్తి కావాల‌ని 16వ తేదీ తాను మళ్ళీ వస్తానని పనులు పూర్తి కాకుంటే సర్పంచ్‌ పై గట్టి యాక్షన్‌ తీసుకుంటానన్నారు. నర్సరీని సందర్శించిన కలెక్టర్‌, నర్సరీలో మొక్కలు ఎండిపోవడంపై వన సంరక్షకునికి 2 వేల‌ జరిమానా వేయాల‌ని గ్రామ సెక్రటరీని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి, గ్రామ పంచాయతీలో ట్రాక్టర్‌, ట్రాలి, టాంకర్‌, ఊరిలో వైకుంఠధామం, రైతు వేదికలు ఉండాల‌ని మీరు అడగకముందే మంజూరు చేసిందని, వాటిని గ్రామస్తులు నిల‌బెట్టుకోవాల‌ని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెట్టాల‌ని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్‌ మల్లాపూర్‌ గ్రామంలో కంపోస్టు షెడ్‌ పూర్తయినందున గ్రామ సర్పంచ్‌ కోరిక మేరకు టెంకాయ కొట్టి ప్రారంభించారు. వన సంరక్షకుల‌కు పలు సూచనలు చేశారు. మొక్కల‌ వద్ద పాదు తీయాల‌ని, రోడ్డు శుభ్రంగా ఉంచాల‌ని, మొక్కల‌కు వాటరింగ్‌ చేయాల‌ని, ఊరు పరిశుభ్రంగా ఉంచాల‌ని సూచించారు. కలెక్టర్‌ వెంబడి ఎంపీడీవో రాములు నాయక్‌, తహసిల్దార్‌ రమేష్‌, సర్పంచు మమత శేఖర్‌, సత్యనారాయణ, ఎంపిఓ సుభాష్‌ చంద్ర బోస్‌, సెక్రటరీలు సువార్త, అనూష సంబంధిత అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

చెట్ల పెంపకమే పరిష్కారం

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐటిఐ కాలేజ్‌ గ్రౌండ్‌లో ...

Comment on the article