Breaking News

ఆపదలో ముందుండేది వైద్యులే

కామారెడ్డి, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ ఆపద వచ్చినా ముందు నిల‌బడేది ప్రభుత్వ వైద్యులేనని, వైద్యులు కనబడని శత్రువు కరోనాతో పోరాటం చేస్తున్నారని, వైద్యుల సేవ‌లు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల‌ రాజేందర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్‌లో ఆదివారం వైద్య శాఖ అధికారుల‌తో సీజనల్‌ వ్యాధులు, కరోనా పరిస్థితుల‌పై సమీక్ష నిర్వహించారు.

కరోనా వ్యాధికి భయపడకుండా వైద్యులు ప్రజల‌కు భరోసా ఇచ్చి వైద్యం అందించాల‌ని సూచించారు. కష్టకాలంలో ప్రజల‌కు విశ్వాసం ఇవ్వవల‌సిన బాధ్యత ప్రభుత్వ వైద్యుల‌పై ఉందని, ప్రభుత్వం అన్ని రకాల‌ రక్షణ చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌ని ఈ సందర్భంగా సూచించారు. సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశమున్నందున ఎలాంటి ల‌క్షణాలు కనిపించినా వెంటనే వైద్య సిబ్బందిని కలిసి సూచనలు, సల‌హాలు పొందాల‌ని కోరారు. దీర్ఘకాలిక జబ్బుల‌తో ఉన్నవారికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రజల‌ ప్రాణాల‌ను కాపాడటంలో కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి తాను అండగా ఉంటానని, నేనున్నానని భరోసా ఇచ్చారు.

కరోనా కంటే భయంకరమైన వ్యాధుల‌ను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ర్యాపిడ్‌ టెస్టుల‌ను ప్రభుత్వం ముమ్మరంగా చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల‌కు పూర్తిస్థాయిలో తమ ప్రభుత్వం భద్రతను ఇస్తోందని తెలిపారు. గ్రామస్థాయిలో ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వ్యాధుల‌ తీవ్రతను గుర్తిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్ల కొరత లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమర్థవంతంగా కరోనాను మంత్రి ఈటల‌ రాజేందర్‌ ఆధ్వర్యంలో ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. జిల్లాలో కరోనాను ఎదుర్కోవడానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. వీటిని ఆరోగ్య శాఖ మంత్రి మంజూరు చేయాల‌ని ఆయన కోరారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ సిహెచ్‌సి కేంద్రాల్లో ఉన్న సమస్యను పరిష్కరించాల‌ని కోరారు. క్వారంటైన్‌ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టి కృషి చేస్తున్నదని తెలిపారు. బికనూర్‌ క్యాంపస్‌ వద్ద ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించాల‌ని కోరారు.

జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దఫేదార్‌ శోభారాజు మాట్లాడుతూ, వైద్య సిబ్బందికి రక్షణ దుస్తుల‌ను అందించాల‌ని కోరారు. వైద్య సిబ్బంది చేసిన సేవల‌ను కొనియాడారు.

పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్‌ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా కట్టడికి వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా నియంత్రణకు ఇమ్యూనిటీ బుస్టర్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల‌ రాజేందర్‌ చేతుల‌మీదుగా ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను పంపిణీ చేశారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడుతూ, లాక్‌ డౌన్‌లో జిల్లా ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, అధికారుల‌ సమిష్టి కృషితో కరోనాను వంద శాతం కట్టడి చేశామని తెలిపారు. స్వశక్తి సంఘాల‌ ద్వారా మాస్కులు తయారు చేయించి స్త్రీ శక్తి మాస్క్‌ బజార్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల‌లో కూడా మాస్కులు అదేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో డ్రగ్‌ స్టోర్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరారు.

ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల‌ సురేందర్‌ మాట్లాడుతూ 3 నెలల‌ క్రితం అంబులెన్సు రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైనందున మరమ్మతులు చేయించాల‌ని కోరారు.

జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే మాట్లాడుతూ పిట్లంలో ఎంపీపీ కవిత ఆధ్వర్యంలో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి భోజన వసతి కల్పించారని తెలిపారు. బిచ్కుంద, జుక్కల్‌ సిహెచ్‌సి నిర్మాణం పూర్తి చేసినందున అక్కడ క్వారంటైన్‌ కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.

జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌ కుమార్‌, వైద్యాధికారి రమేష్‌ రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

కరోనా కంట్రోల్ సెల్‌ నెంబర్‌ ఇదే….

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ...

Comment on the article