Breaking News

100 బెడ్లకు ఆక్సీజన్‌ ఏర్పాటు చేశాం

ఆర్మూర్‌, జూలై 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రిని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. మంగళవారం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆర్మూరు ఏరియా హాస్పిటల్‌లోని అన్ని వార్డుల‌ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన పేషంట్లని అడ్మిట్‌ చేసుకోవడానికి 30 బెడ్స్‌తో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, వెంటిలేటర్‌ అవసరమున్న వాళ్లను నిజామాబాద్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కొవిడ్‌ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల‌నే ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని రకాల‌ చర్యలు తీసుకుంటుందని, నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో కార్పోరేట్‌ హాస్పిట్లకు సమానంగా ట్రీట్మెంట్‌, మెడిసన్‌ కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 45 వెంటిలేటర్స్‌ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన జిల్లాకు వచ్చినప్పుడు వెంటిలేటర్స్‌ 45 నుండి 60కి పెంచే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్మూరు ఏరియాకు సంబంధించిన కోవిడ్‌ పాజిటివ్‌ పేషెంట్స్‌కు ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రిలో ట్రీట్మెంట్‌ ఇచ్చే విధంగా 30 బెడ్స్‌ అన్ని సదుపాయాల‌తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

బోధన్‌ ఏరియా ఆస్పత్రిలో కూడా ఆ డివిజన్‌కు సంబంధించి అక్కడే ట్రీట్మెంట్‌ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే డాక్టర్లకు ట్రైనింగ్‌ ఇవ్వడం జరిగిందని, హాస్పిటల్లో అన్ని రకాల‌ ఫెసిలిటీస్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆర్మూర్‌ ఏరియా హాస్పిటల్లో 100 బెడ్స్‌కు ఆక్సిజన్‌ ఏర్పాట్లు చేశామని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించడానికి చేయాల్సిన అన్ని రకాల‌ ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందన్నారు.

అదే విధంగా ప్రజలు భయబ్రాంతుల‌కు గురి కావద్దని కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్‌ ఇమ్మ్యూనిటి పెంచుకోవాల‌ని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు 100 మందిలో 20 మందికి ఎలాంటి సింప్టమ్స్‌ లేకుండానే పాజిటివ్‌ వచ్చి వెళ్ళిపోతుందని, వచ్చిన విషయం వారికి కూడా తెలియదని, ఐదు శాతం మందికి మాత్రమే హాస్పిటల్‌ అవసరమవుతుందని, జిల్లాలో అన్ని రకాల‌ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వెంటిలేటర్‌ సిబ్బందికి ట్రైనింగ్‌ ఇచ్చుకోవడం, మెడిసన్‌ అందుబాటులో ఉంచుకోవడం జరిగిందన్నారు.

ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రిలో కూడా కార్పొరేట్‌ హాస్పిటల్లో అందుబాటులో ఉండే మెడిసిన్స్‌ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, బయటికి వెళితే మాస్కు తప్పని సరి ధరించాల‌ని, గుంపులు గుంపులుగా జమకూడరాదని, భౌతిక దూరం పాటించాల‌ని, రోగ నిరోధకశక్తిని పెంచుకునే విధంగా వ్యాయామం, యోగ, ప్రాణాయామం చేయడం, వేడి నీళ్ళు తీసుకోవడం, ఉప్పునీటితో పుక్కిలించడం, సి విటమిన్‌, డి విటమిన్‌, జింక్‌ లాంటివి ల‌భించే పండ్లు, కూరగాయలు, ఆహారపదార్థాలు తీసుకోవడం చేయాల‌ని, జాగ్రత్తలు తీసుకుంటే మైల్డ్‌ సింప్టమ్స్‌తో బయట పడే అవకాశముందన్నారు.

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉంటే వాళ్ళందరిని హోం ఐసోలేషన్‌లో ఉంచి డాక్టర్ల పర్యవేక్షణలో వారికి వైద్యం అందిస్తున్నామని, వారికి సపరేట్‌ కిట్టు ఇస్తున్నామని, రేపటి నుంచి కిట్టు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని, పాజిటివ్‌ వచ్చి హోమ్‌ ఐసొలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు మెడికల్‌ ఆఫీసర్ల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే మంచి డైట్‌ తీసుకుంటూ మందులు వాడినట్లయితే వైరస్‌ తగ్గిపోయే అవకాశముందన్నారు.

భయపడ కూడదని, ధైర్యంగా మనం ఎదుర్కోగల‌మని, ప్రైవేట్‌ హాస్పిట‌ల్ల‌ చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేసు కోవద్దని, ప్రభుత్వం హాస్పిటల్లో అన్ని రకాల‌ ఫెసిలిటీస్‌ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పరీక్షల‌ కోసం అన్ని పీహెచ్‌సిలో రేపిడ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ ల్యాబ్‌ ద్వారా పరీక్షలు చేపడుతున్నారని, అందరికీ టెస్టులు అవసరంలేదని, ఎవరికైతే ల‌క్షణాలు ఉన్నాయో వారికి పీహెచ్‌సిల్లో రాపిడ్‌ టెస్టులు చేసి అరగంటలోనే రిపోర్టు చెప్పి దానికి సరిపడ్డ ట్రీట్మెంట్‌ కూడా స్టార్ట్‌ చేయడం జరుగుతుందని తెలిపారు.

కరోనా వైరస్‌ అరికట్టే విధంగా డాక్టర్ల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు. జిల్లా కలెక్టర్‌ వెంట హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌, ఆర్‌డివో శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

Comment on the article