Breaking News

జ్ఞాపకశక్తి లేక 16 ఏళ్లుగా దుబాయిలోనే

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం చింతమానుపల్లి గ్రామానికి చెందిన నీల ఎల్ల‌య్య 2004 లో ఒక కంపెనీలో భవన నిర్మాణ కూలీగా దుబాయికి వెళ్ళాడని, కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ మానసిక స్థితి సరిగాలేక కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయి ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి) గా మారాడని ఎమిగ్రేంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి పేర్కొన్నారు.

గత 16 సంవత్సరాలుగా దుబాయి, షార్జా ప్రాంతాల‌లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఎల్ల‌య్య జీవిస్తున్నాడని, కరోనా నేపథ్యంలో యుఎఇ దేశంలోని దుబాయి, షార్జాలో భోజనం, వసతి లేక ఇబ్బంది పడుతున్న వల‌స కార్మికుల‌కు ఉచితంగా నిత్యావసర వస్తువులు అందజేసే క్రమంలో జైన్‌ సేవా మిషన్ వాలంటీర్‌ రూపేష్‌ మెహతా పలు ప్రాంతాల‌లో తిరుగుతున్న సందర్బంగా నీల ఎల్ల‌య్య దయనీయ పరిస్థితిని గమనించి చేరదీశాడన్నారు.

దుబాయిలోని భారతీయ రాయబార కార్యాల‌యం (ఇండియన్‌ కాన్సులేట్‌) ద్వారా ఎల్ల‌య్యకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ (తాత్కాలిక పాస్‌ పోర్టు) ఇప్పించి స్వదేశానికి పంపడానికి రూపేష్‌ మెహతా ప్రయత్నిస్తున్నారని, ఎల్ల‌య్య 16 ఏళ్ళ క్రితం యుఎఇ దేశంలోకి ప్రవేశించిన పాస్‌ పోర్టు వివరాలు సమర్పిస్తేనే తాత్కాలిక పాస్‌ పోర్టు జారీ చేయడం వీలు అవుతుందన్నారు. ఎల్ల‌య్య దగ్గర ఓటర్‌ గుర్తింపు కార్డు తప్ప ఇతర ఏ ఆధారాలు లేవు.

ఈ విషయంలో ఎల్ల‌య్య కుటుంబ సభ్యుల‌తో సంప్రదించి ఆధారాల‌ సేకరణ కొరకు సహకరించాల్సిందిగా రూపేష్‌ మెహతా తెలంగాణలోని ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ సహకారాన్ని కోరారు. ప్రవాసిమిత్ర ప్రతినిధులు సోమవారం జూలై 27వ తేదీ ఎల్ల‌య్య భార్య రాజవ్వను హైదరాబాద్‌ లోని పాస్‌ పోర్టు కార్యాల‌యానికి పిలిపించి పాస్‌ పోర్టు అధికారికి వినతి పత్రం ఇప్పించారు. తన భర్త ఎల్ల‌య్య పేరిట 2004 కంటే ముందు హైదరాబాద్‌లో జారీ చేసిన పాస్‌ పోర్టు నెంబరు, ఇతర వివరాల‌ను డేటాబేస్‌లో వెతికి ఇవ్వాల‌ని ఆమె తన దరఖాస్తులో కోరారు.

ఈ సందర్బంగా ఎల్ల‌య్య భార్య రాజవ్వ మాట్లాడుతూ తన భర్త 16 ఏళ్ల క్రితం దుబాయికి వెళ్ళేటప్పుడు తన కూతురు సునంద నెల వయసు ఉన్న పాలు తాగే పసికందు అని చెప్పారు. కూలీ నాలీ చేసుకొని కూతురును పెంచి పెద్దచేసి పెళ్లిచేశానని, ఆమెకు ఒక కుమారుడని వివరించింది. ఎలాగైనా తన భర్తను దుబాయి నుండి ఇండియాకు తెప్పించాల‌ని ఆమె వేడుకున్నది.

Check Also

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) ...

Comment on the article