Breaking News

పిడి యాక్టు నమోదు చేయాలి

కామారెడ్డి, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండల‌ తహసిల్దార్‌ కార్యాల‌యంలో సమాచార సేకరణ కోసం వెళ్లిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ శ్రీనివాస్‌పై అక్కడే ఉన్న కటిక రమేష్‌ అనే వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా దాడికి పాల్ప‌డి చేయి విరగొట్టడం జరిగిందని, తహసిల్దార్‌ కార్యాల‌యం సాక్షిగా దాడి జరిగినా అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది అడ్డుకోకుండా కనీసం పోలీసుల‌కు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక కుట్ర దాగి ఉందని ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు.

సదాశివనగర్‌ మండలంలో భూ కుంభకోణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని బహుజన సమాజంపై వేధింపులు జరుగుతున్నాయని వీటిపై వివరణ తీసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేయడం, రాజ్యాంగంలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలువబడే జర్నలిజం పై దాడి అని దీన్ని ఎం సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పార్టీ కార్యాల‌యంలో శుక్రవారం విలేకరుల‌తో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం, రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు మీడియాను ఒకవైపు పావుగా వాడుకుంటూ వారు చేసే పొరపాట్లను ఎత్తిచూపిన వారిపై దాడుల‌కు పాల్ప‌డడం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రస్తుత కరోనా నేపథ్యంలో విశేషమైన సేవలందిస్తున్న విలేకరుల‌పై దాడికి పాల్ప‌డిన కటిక రమేష్‌ అతని వెనకాల‌ ఉన్న వ్యక్తుల‌ను విచారించి తక్షణం పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. పోలీసు యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం గాని జర్నలిస్ట్‌ పై జరిగిన దాడిని నిర్లక్ష్యం చేస్తే వారం రోజుల్లోపు జర్నలిస్టు సంఘాలు బహుజన సంఘాల‌న్నింటితో జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు మద్దెల‌ రాజయ్య, అబ్దుల్‌ సాదక్‌, తదితరులు ఉన్నారు.

Check Also

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం రామారెడ్డి శివారు గొల్లపల్లి గేట్‌ సమీపంలో ...

Comment on the article