Breaking News

టెస్టులందు కోవిడ్‌ టెస్టులు వేరయా….

నిజామాబాద్‌, ఆగష్టు 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తె‌లు‌గులో వేమన అనే కవి నాడు బుడ్డగోచీ పెట్టుకొని నీతి శతకాన్ని రాశాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాన్ని పెట్టాడు. అది నేటికి నీతివిద్యగా కొనసాగుతుంది. నీతి అయినా, నిజం అయినా ఎవరు చెప్పారనేది ముఖ్యం కాదు.. ఎవరినుంచైనా స్వీకరించాల్సిందే… సరే ఆ విషయం పక్కన పెడితే…

గత ఐదారుమాసాలుగా కోవిడ్‌ అనే మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలోని చాలా దేశాల్ని అతలా కుతలం చేస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో మానవ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇదిలా ఎన్ని రోజులు, నెల‌లు ఉంటుందనేది అందరి మెదళ్ళలో మెదలుతున్న సమాధానం లేని ప్రశ్న. కోవిడ్‌ నియంత్రణకు త్వరలో వాక్సిన్‌ వస్తుందన్న వార్తలొస్తున్నాయి…ప్రపంచ మేధావులు అదే పనిలో నిమగ్నమైనారు. ఎంత త్వరగా వాక్సిన్‌ వస్తే అంత మంచిదని అందరూ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్‌ పరీక్షల‌ విషయంలో అనేక సందేహాలు, తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఇటీవల కాలంలో కోవిడ్‌ పరీక్షలు పెద్ద మొత్తంలో చేపడుతున్నారు. అయితే గ్రామాల్లో కోవిడ్ ల‌క్షణాలున్న వారు స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోగా కొందరికి నెగిటివ్‌, కొందరికి పాజిటివ్‌ రిపోర్ట్సు వస్తున్నాయి.

పట్టణ ప్రాంతాల్లోని కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల‌కు కోవిడ్‌ పరీక్షల‌కు, ట్రీట్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కాగా గ్రామీణులు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు పట్టణంలోని ఆసుత్రుల‌కు వచ్చి పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌ రిపోర్ట్సు వస్తుంది. దీంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయం బాగా ప్రచారం కావడంతో పాజిటివ్‌ వచ్చిన వారు భయభ్రాంతుల‌కు గురై పట్టణాల‌కు వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు.

ఏది నిజం?

కోవిడ్‌ అనేది చాలా సున్నితమైన విషయం అయినప్పటికీ పరీక్షలు, ఫలితాల‌ విషయంలో ప్రభుత్వ వైద్యులు గ్రామాల్లో ఎలా చేస్తున్నారనేది తెలియరావడం లేదు. పాజిటివ్‌, నెగిటివ్‌ వచ్చిన వారు ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు రిపోర్టు ఇస్తే భయభ్రాంతుల‌కు గురవుతున్నామని, లేని రోగం అంటగడుతున్నారని అంటున్నారు. మరి ల‌క్షణాలున్న వారు గ్రామాల్లో పరీక్షలు చేయించుకోవాలా? పట్టణ ఆసుపత్రుల్లో పరీక్షు చేయించుకోవాలా? అనే గందర గోళం నెల‌కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి ఖచ్చితమైన పరీక్షలు, రిపోర్టు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల‌ని ప్రజలు కోరుతున్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article