నిజామాబాద్, సెప్టెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక తెలంగాణ వలస కార్మికుడు దుబాయి నుండి స్వగ్రామానికి చేరి కుటుంబాన్ని కలుసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అతను దుబాయికి వెళ్ళేటప్పుడు అతని కూతురు పాలుతాగే పసిగుడ్డు. ఇప్పుడు ఆమెకుపెళ్లయి ఏడాది బాబు ఉన్నాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమానుపల్లె గ్రామానికి చెందిన నీల ఎల్లయ్య 2004 లో ఒక భవన నిర్మాణ కంపెనీలో కూలీగా పనిచేయడానికి యుఎఇ దేశానికి వెళ్ళాడు. మానసిక స్థితి సరిగాలేక కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయి గత 16 ఏళ్లుగా దుబాయి, షార్జా ప్రాంతాలలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించాడు.
స్వదేశానికి వెళ్లిపోవాలనే ధ్యాస లేక పోవడం, పాస్ పోర్టు లేని కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. ఎల్లయ్య దయనీయ పరిస్థితిని గమనించిన ‘జైన్ సేవా మిషన్’ అనే సామాజిక సేవా సంస్థకు చెందిన వాలంటీర్ రూపేష్ మెహతా అతనికి దుబాయి ఇండియన్ కాన్సులేట్ నుండి ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (తాత్కాలిక పాస్ పోర్టు) ఇప్పించాడు. ఎల్లయ్య 16 ఏళ్ళ క్రితం యుఎఇ దేశంలోకి ప్రవేశించిన పాస్ పోర్టు వివరాలు అందుబాటులో లేనందున తాత్కాలిక పాస్ పోర్టు జారీ చేయడం ఆలస్యమయింది. ఎల్లయ్య భార్య విజ్ఞప్తిమేరకు హైదరాబాద్ పాస్ పోర్టు కార్యాలయం వారు 2004 జనవరిలో ఎల్లయ్యకు జారీ చేసిన పాస్ పోర్టు నెంబరు ఇతర వివరాలను డేటా బేస్‌లో వెతికి సమకూర్చడం వలన దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ వారు తాత్కాలిక పాస్ పోర్టు జారీ చేయడం సులువు అయ్యింది.
దుబాయి లోని భారత దౌత్య అధికారులు జితేందర్ సింగ్ నేగి, హర్జీత్ సింగ్ు ఎల్లయ్యకు తాత్కాలిక పాస్ పోర్ట్ జారీకి సహకరించారు. కాన్సులేట్ వారు దుబాయి నుండి హైదరాబాద్ కు ఉచిత విమాన ప్రయాణ టికెట్టు కూడా సమకూర్చారు. యుఎఇ ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం వీసా గడువుమీరి ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారు రోజుకు 25 దిర్హములు (రూ.500) చొప్పున ‘ఓవర్ స్టే’ జరిమానా చెల్లించాలి.
ఈ విధంగా 16 సంవత్సరాలకు 1.46 లక్షల దిర్హము (రూ.29 లక్షలు) భారీ జరిమానా అవుతుంది. సామాజిక సేవకుడు రూపేష్ మెహతా ఇండియన్ కాన్సులేట్ సహకారంతో దుబాయి ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించి ఎల్లయ్యకు భారీ జరిమానాను మాఫీ చేయించారు. అతను యుఎఇ దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి పత్రం (ఇమిగ్రేషన్ అవుట్ పాస్) ఇప్పించాడు. యుఎఇ ప్రభుత్వం 18 ఆగస్టు నుండి 17 నవంబర్ వరకు మూడు నెలలపాటు ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) పథకం ఇందుకు బాగా ఉపయోగపడిరది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎల్లయ్య ఎట్టకేకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో దుబాయి నుండి హైదరాబాద్‌కు సోమవారం (31.08.2020) రాత్రి చేరుకున్నాడు.
శారీరక నీరసంతో, మానసిక ఒత్తిడితో, మతిమరుపుతో బాధపడుతున్న ఎల్లయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు మానవతా దృక్పథంతో ‘హోం క్వారంటైన్’ కు అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులోని ప్రోటోకాల్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ఎల్లయ్యకు ఇమిగ్రేషన్ తదితర లాంఛనాలు పూర్తి చేయించి బయటకు తీసుకువచ్చి అర్ధరాత్రి తర్వాత అతని భార్య రాజవ్వ, ఇతర బంధువులకు అప్పగించారు. మంగళవారం (01.09.2020) ఉదయం వారి స్వగ్రామం చింతమానుపల్లె చేరుకున్నారు. ఎల్లయ్యను దుబాయి నుండి ఇండియాకు తెప్పించడానికి ఎల్లయ్య కుటుంబ సభ్యులతో, దుబాయిలోని సామాజిక సేవకులతో, పాస్ పోర్టు కార్యాలయంతో, దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్‌తో సమన్వయం చేయడంలో హైదరాబాద్ ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ప్రతినిధులు బాగా కృషిచేశారు.
ఎల్లయ్యను వాపస్ తెప్పించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, సమస్యను ప్రపంచానికి తెలియజేసిన మీడియాకు ఎల్లయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 16 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత దుబాయి నుండి గ్రామానికి చేరుకున్న ఎల్లయ్య కుటుంబంతో, సమాజంతో కలిసిపోయేలా అతనికి పునరావాసం కల్పించాలని వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ప్ దేశాలలో ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల సహాయం కోసం, ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ నెంబర్ 91 94916 13129 లేదా భారత ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 కు కాల్ చేయవచ్చని తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021