Breaking News

సర్కార్‌ భూమి హాంఫట్‌..!

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతనొక రెవెన్యూ శాఖలో చిరుద్యోగి. ఓ గ్రామంలో విఆర్‌ఏగా పని చేస్తుంటాడు..ఉద్యోగం కంటే ఎక్కువ రియల్‌ ఎస్టేట్‌ పై దష్టి పెడతాడు. విలువైన భూములపై దష్టి సారించి కబ్జాకు యత్నిస్తూ ఏకంగా జాతీయ రహదారికి ఆనుకొని వున్న ఐదెకరాల భూమిపై కన్నేశాడు..రెవెన్యూ శాఖలో వున్న లొసుగులే అతని ఆయుధం.

కామారెడ్డి పట్టణానికి 6 కిలోమీటర్ల దూరలోని జాతీయ రహదారిపై గల ఐదెకరాల భూమిని బినామీ పేరిట పాసుబుక్‌ పొందాడు. ఇటీవల ఈ భూమిని సదరు విఆర్‌ఏ 40 లక్షలకు విక్రయించగా గ్రామ నాయకులు అడ్డుకున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు. విషయం తెలిసి రెవెన్యూ అధికారులు పాసుబుక్‌ రద్దు చేశారు. అనంతరం విఆర్‌ఏ పట్టు వీడకుండా రంగంలోకి భూ మాఫియాను దింపాడు.

వివాదాస్పద భూముల్లో తలదూర్చి భూములు కాజేసే ఈ భూ మాఫియాకు సదరు విఆర్‌ఏ చేదోడు వాదోడుగా ఉంటూ తన కేసులో వారి సహకారం తీసుకొన్నట్లు తెలుస్తోంది. పాసుబుక్‌ రద్దయిన తర్వాత పనులు మొదలు పెట్టాడు. తొలుత విఆర్‌ఏను అడ్డుకున్న నాయకులు సైతం మాఫియా రంగ ప్రవేశంతో సైలెంట్‌ అయ్యారు. అయితే ఇదే భూమి విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వచ్చి శివారులో గల ఓ పాఠశాలలో తిష్ట వేసి ఇది తనదంటూ గగ్గోలు పెట్టడం, అతనికి గ్రామ నాయకులు మద్దతివ్వడంతో అధికారులు అప్రమత్తమై వాస్తవాలను తెలుసుకున్నారు.

ఇప్పటి ఈ భూమిలో ఎవరు ఎలాంటి పనులు మొదలు పెట్టకపోగా పంట పెట్టలేదని గ్రహించి పట్టాదార్‌ పాసుబుక్‌ రద్దు చేశారు. ఇదే సమయంలో గ్రామ నాయకులు యూ టర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం విఆర్‌ఏ మాఫియా మద్దతుతో భూమిని చదును చేయించారు. కాగా ఈ వ్యవహారంలో ఓ ఉద్యోగ సంఘ నాయకుడు విఆర్‌ఏకు గతంలో మద్దతిచ్చి పాసుబుక్‌ జారీ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు వున్నాయి.

భూమి లేని నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూమి ప్రస్తుతం మాఫియా చేతిలో మార్కెట్‌ వస్తువుగా మారింది. ఓ వైపు రెవెన్యూ కొత్త చట్టం అమల్లోకి వస్తుండగా ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. జాతీయ రహదారికి అనుకొని వున్న ఈ భూమికి మరో వైపు కూడా బిటి రోడ్‌ (డాంబర్‌ రోడ్‌) ఉండడంతో దీని విలువ మాములు భూములకంటే ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్‌ రేట్‌ ప్రకారం దీని విలువ 15 కోట్లు ఉంటుందని అంచనా.

కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఇకనైనా ఈ వ్యవహారంలో జిల్లా అధికారులు స్పందించి వెంటనే సదరు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Check Also

అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ...

Comment on the article