Breaking News

క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున అధికారులందరూ వారి హెడ్‌ క్వార్టర్స్‌ లోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా రెవిన్యూ డివిజనల్‌ అధికారులు తహశీల్దార్‌, అధికారులు వర్షాలు, వరదలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మండల వారిగా సమీక్షించారు.

ఏ సమయంలో అడిగినా వివరాలు అందించే అధికారులందరూ తమ హెడ్‌ క్వార్టర్స్‌లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి గ్రామంలో పంచాయితీ సెక్రటరీ, ఏపీ రెవిన్యూ అసిస్టెంట్‌ సిబ్బందితో ప్రతి చెరువు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం నిండిన చెరువులు కుంటలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ఏమైనా గండ్లు పడ్డాయా, తెగిపోవడానికి ఏమైనా ఆస్కారాలు వున్నాయా అనేది పరిశీలించుకోవాలని, ముఖ్యంగా బుక్కల్‌, మదునూర్‌, బిచుకుంద మండలాలలో నాలాలు, వాగులను తనిఖీ చేయాలని తెలిపారు.

గ్రామాలలో కూలడానికి సిద్ధంగా వున్న మట్టి ఇళ్ల వివరాలను సేకరించి, నిఘా వుంచాలని, వాటిలో ఎవరినీ నివాసం వుంచరాదని, వారికి పాఠశాలల్లో ప్రభుత్వ భవనాలలో తాత్కాలిక వసతి కల్పించాలని తెలిపారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి రోడ్లపై శ్రద్ధ కనబరచాలని, దెబ్బతిన్న చోట టెంపరరీ రోడ్లను వెంటనే వేసేలా, రోడ్లపై నీరు ఓవర్‌ ప్లో అయ్యే చోట్లలో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అనంతరం శాశ్వత మరమ్మతులకు చర్యలు చేపట్టాలని తెలిపారు. పంటల నష్టాన్ని సేకరించాలని, ఇళ్ళు కూలిపోయిన వారికి తక్షణమే సహాయం అందించాలని తహాశీల్దార్లను సూచించారు.

సరిహద్దు మహారాష్ట్ర, కర్ణాటక అధికారుల సమన్వయంతో పరిస్థితులను సమీక్షించుకోవాలని, గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు తగ్గాక వాగులు, వంకల నివేదికలు సమర్పించాలని తెలిపారు. ధరణి వెబ్‌సైటు నిర్వహణకు కావలసిన మెటీరియల్‌, సిబ్బంది వివరాలు తక్షణమే అందించాలని తహశీలుదార్లను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article