Breaking News

సిటీ బస్సులు నడపాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి మరియు నూతన కలెక్టరేట్‌కి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యూ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడారు.

ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ, పీజీ కాలేజీలో చదివే విద్యార్థులు గ్రామీణ పేద, మధ్యతరగతి విద్యార్థులు. వీరు నిత్యం కాలేజీకి రావడానికి గ్రామాలనుండి ప్రధాన బస్‌ స్టాండ్‌ వచ్చి, అక్కడినుంచి కాలేజీకి అనేక అవస్థలు పడుతూ ప్రయాణ రాక పోకలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా కాలేజీ ప్రక్కనే నిర్మాణమవుతున్న నూతన కలెక్టరేట్‌ను వచ్చేనెల అక్టోబర్‌ ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించడం జరిగిందన్నారు.

నూతన జిల్లా కలెక్టరేట్‌లో అనేక శాఖలు కార్యాలయాలు ఒకే చోట ఉండటం వలన అధికారుల ప్రజల రాకపోకల సంఖ్య అధికంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ గిరిరాజ్‌ కాలేజీకి, నూతన కలెక్టరేట్‌కి ఆర్టీసీ సిటీ బస్సులు బస్టాండ్‌ నుంచి నడపడం వల్ల ప్రజలకు, అధికారులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌, పీజీ విద్యార్థులకు పరీక్షలు జరుగుతుండటంతో తక్షణమే ప్రభుత్వ గిరిరాజ్‌ కాలేజీకి, నూతన కలెక్టరేట్‌కి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేలా కలెక్టర్‌, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా నాయకులు ప్రత్యూష, నిఖిల్‌, సాయితేజ, విజయ్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మరోసారి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల 24న మలేషియాలో గుండెపోటుతో చనిపోయిన బాల ...

Comment on the article