Breaking News

డిమాండ్‌ ఉన్న పంట పండిస్తే అందరికి లాభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫైన్‌ రకం వరికి మద్దతు ధరకన్నా ఎక్కువకు కొనే ట్రేడర్స్‌కు జిల్లా యంత్రాంగం మద్దతు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో దాన్యం కొనుగోళ్లపై రైస్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌, డిసిబి డైరెక్టర్స్‌ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సన్న రకాలు ఎక్కువ పండించారని, దొడ్డు రకాలు తక్కువ పండాయని, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటను పండిస్తే, పండించిన రైతుకు, ట్రేడర్‌కు, వినియోగదారునికి అందరికీ లాభం జరుగుతుందన్నారు. ఫైన్‌ వెరైటీ రకాలు పండించిన వ్యవసాయ దారులకు మంచి మార్కెట్‌ రేట్‌ అందించాల్సిన అవసరముందన్నారు. వ్యవసాయదారునికి విశ్వాసం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

రబీలో సన్న రకాలు లక్ష మెట్రిక్‌ టన్నులు పండిస్తే ప్రస్తుతం 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం దాన్యం కొనుగోలు సెంటర్లకు వస్తుందని, అందుకు అవసరమైన టార్పాలిన్‌, మొయిశ్చర్‌ మీటర్‌, గోనె సంచులు అన్ని సప్లై చేయడం జరుగుతుందన్నారు. రబీలో 357 కొనుగోలు సెంటర్లు ఉంటే ప్రస్తుతం 540 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కొనుగోలు సెంటరు ఉండాలని, మిల్‌ ట్యాగింగ్‌ ట్రాన్స్‌పోర్టు తదితర ఏర్పాట్లు చేస్తున్నామని, గతంలో 5 ట్రాన్స్‌ పోర్ట్‌ కంపెనీలకు ఇస్తే ప్రస్తుతం 8 ట్రాన్స్‌పోర్టు కంపెనీలకు కాంట్రాక్ట్‌ ఇవ్వడం జరిగిందన్నారు.

జిల్లా యంత్రాంగం రెగ్యులర్‌గా మోనిటర్‌ చేసే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు. రైతుకు మద్దతు ధర కన్నా ఎక్కువ ధర రావాలని, ప్రైవేటు లేని చోట ప్రభుత్వం మద్దతు ధరకు దాన్యం కొంటుందని, 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల టార్గెట్‌ పెట్టామన్నారు. ప్రభుత్వం మొత్తం ధాన్యం కొంటుందని, ఒకవేళ మంచి మార్కెట్‌ ఉండి, మంచి రేటు రైతుకు ఇచ్చి ట్రేడింగ్‌ చేస్తా అంటే ప్రభుత్వం సపోర్టు చేస్తుందన్నారు.

ప్రైవేటుగా అమ్ముకుంటే వారికి కావలసిన ఫెసిలిటీస్‌ కల్పిస్తామని, అక్టోబర్‌ మొదటి వారంలో ధాన్యం వస్తుందని, ఫస్ట్‌ కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, ట్రేడర్స్‌ లేట్‌ అయితే ఇబ్బంది కాకుండా మద్దతు ధరకు కొంటామని, నిజామాబాద్‌ రైస్‌ మిల్లర్స్‌ రైతుల నుండి ధాన్యం కొనడానికి ముందుకు రావాలని, వ్యవసాయశాఖ, రెవిన్యూ, సివిల్‌ సప్లై మూడు శాఖలు కావలసిన సపోర్ట్‌ చేస్తాయని, వ్యవసాయ దారునికి మంచి రేటు ఇచ్చేటట్టు ముందుకు సాగాలని, మిల్లర్స్‌ లాస్‌ కాకుండా రైతులకు లాభమయ్యే విధంగా ముందుకు పోవాలన్నారు.

ఏఇవోలు సర్టిఫై చేసిన ధాన్యానికి తరుగు ఉండరాదన్నారు. రైల్వే అధికారులు ప్యాడి, రైస్‌, ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్‌పోర్టింగ్‌ కోసం రేకులు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, రైల్వే సీనియర్‌ డివిజనల్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ బి వెంకన్న, డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జనార్ధన్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌, డిసిబి డైరెక్టర్స్‌ సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article