Breaking News

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి పేదలను దోపిడి చేయడమే కాకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజలను దోచుకుంటుందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మంగళవారం భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని టీఆర్‌ఎస్‌ సర్కారు నాలుగేళ్ల క్రితం హామి ఇచ్చి కాగితాలకే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు.

పేదోళ్లకు సొంతిటి కల కల గానే మిగిలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ప్రశాంత్‌ రెడ్డి ఇళ్ల మంత్రిగా ఉన్నా జిల్లాలో ఒక్కరికి కూడా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వలేదని, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పూర్తి కాలేదన్నారు. నిజామబాద్‌ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పరిధిలో 9550 ఇళ్లు మంజూరయ్యాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు కానీ నాలుగేళ్లలో పూర్తయింది 886 మాత్రమేనన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌కు 2330, రూరల్‌ నియోజకవర్గానికి 1536, ఆర్మూర్‌కు 1532, బాల్కొండకు 800 ఇళ్లు, బోధన్‌కు 1712 ఇళ్లు మంజూరయ్యాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, అర్బన్‌లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇళ్లు ఇవ్వలేదన్నారు. అవి పూర్తయ్యాయని చెబుతున్నా ఎప్పుడిస్తారో ప్రభుత్వానికే క్లారిటీ లేదని బస్వా అన్నారు. దసరా వరకైనా నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలని లేని పక్షంలో డబుల్‌ బెడ్‌ రూంలు పేదలకు అందించే వరకు బీజేపీ పక్షాన పోరాటం చేస్తామన్నారు. జిల్లాలో డబుల్‌ బెడ్‌రూంల కోసం ఎదురుచూస్తున్న పేదల కోరిక దసరా నాటికి తీర్చాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం పేరిట ప్రజలను మోసగించిందని, నిజామాబాద్‌ జిల్లాలో స్పీకర్‌ నియోజకవర్గం మినహాయిస్తే నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని బీబీ పూర్‌ తాండలో 50 ఇళ్ళు తప్పితే ఎక్కడ కూడా లబ్ధిదారులకు కేటాయించలేదని స్పష్టం చేశారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని, మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఆవాస్‌ పథకం నిధులను డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకానికి వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆవాస్‌ యోజన అర్బన్‌ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 2197 కోట్లు విడుదలయ్యాయని, ఆ నిధులను వేటికి వినియోగించారో కేసీఆర్‌ తెలపాలన్నారు. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కి 20 లక్షలు, మహారాష్ట్రలో 12.5 లక్షలు ఇళ్ళు మంజూరయ్యాయని, ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అక్రమ లే అవుట్లు, ప్లాట్లు, స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి ఆఖరి అవకాశం కల్పించిందని, చివరి అవకాశం పేరుతో ప్రజలపై భారం మోపుతోందన్నారు. కరోనా కష్టకాలంలో ఎల్‌.ఆర్‌.ఎస్‌. పేరుతో ప్రభుత్వం పేదల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందన్నారు.

కేవలం ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు ఎల్‌.ఆర్‌.ఎస్‌. ప్రవేశపెట్టిందని, ఇప్పటి వరకు దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి 11 కోట్ల 2 లక్షల రూపాయలు ఫీజల రూపంలో ఆదాయం వచ్చిందన్నారు. ఎల్‌.ఆర్‌.ఎస్‌.ఇదే చివరి సారి అంటూ చార్జీల భారం మోపడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఎల్‌.ఆర్‌.ఎస్‌. చార్జీలను పూర్తిగా ఎత్తివేయాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు.

ఎప్పుడో కొని పెట్టుకున్న స్ధలాలకు ఇప్పుడు లక్షల్లో చార్జీలు కట్టాలనడం ఎంత వరకు సమంజసమని, వారసత్వంగా వచ్చిన జాగాలకు కూడా ఎల్‌.ఆర్‌.ఎస్‌.. కట్టాలనడం దూర్మార్గమన్నారు. ఎల్‌.ఆర్‌.ఎస్‌. లేకుంటే రిజిస్ట్రేషన్లు చేయవద్దని, ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని నిర్ణయించడం దారుణమన్నారు.

ఇదే చివరి ఛాన్స్‌ అంటూ మెడపై కత్తి పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు ప్రభుత్వం వ్యవహారిస్తుందని, టీఆర్‌ఎస్‌ నాయకులు తమ ఆక్రమ ఆస్తులను క్రమబద్దీకరించుకునేందుకు ఎల్‌.ఆర్‌.ఎస్‌. స్కీం తీసుకొచ్చారన్నారు. ఎల్‌.ఆర్‌.ఎస్‌. జీవో 131 ను రద్దు చేయాలని, పేద మధ్య తరగతి ప్రజలపై భారం లేకుండా చూడాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

సమ్మెకు పిడిఎస్‌యు మద్దతు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, నవంబర్‌ 26న జరిగే ...

Comment on the article