Breaking News

‘బాలు’ అస్తమయం…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ పి. బాలసుబ్రహ్మణ్యం (జననం 1946, జూన్‌ 4) గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఈయన ఉత్తర ఆర్కాడు జిల్లా (ప్రస్తుత తిరువళ్ళూరు జిల్లా) లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు.

1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

జననం : 1946 జూన్‌ 4 (వయస్సు : 74 సంవత్సరాలు)

కోనేటమ్మపేట, ఉత్తర అర్కాడు జిల్లా, మద్రాసు ప్రెసిడెంసి (ప్రస్తుత తిరువళ్ళూరు జిల్లా, తమిళ నాడు)

మరణానికి కారణం : కోవిడ్‌ 19

నివాసం : చెన్నై, తమిళనాడు

ఇతర పేర్లు బాలు, గాన గంధరర్వుడు

వత్తి : నేపధ్య గాయకుడు

సంగీత దర్శకుడు. నిర్మాత, నటుడు

మతం : శైవ బ్రాహ్మణ హిందూ

జీవిత భాగస్వామి : సావిత్రి

పిల్లలు : చరణ్‌, పల్లవి

తల్లిదండ్రులు : శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (తండ్రి), శకుంతలమ్మ (తల్లి)

1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు.

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌, విష్ణు వర్ధన్‌, జెమిని గణేశన్‌, గిరీష్‌ కర్నాడ్‌, అర్జున్‌, నగేష్‌, రఘువరన్‌ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు. సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.

బాలుకు భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. ఈయన 25 సెప్టెంబర్‌ 2020 న చెన్నయ్‌ లోని ఎంజీఎం ఆసుపత్రిలో మరణించారు.

Check Also

కోవిడ్‌ వారియర్స్‌గా గుర్తించండి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ బారిన పడ్డ దాదాపు వెయ్యిమంది ...

Comment on the article