Breaking News

మూగవోని గొంతు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు తిరుమల గోవిందా వనమాల క్షేత్రంలోని పద్మావతి కల్యాణం మండపంలో నిర్వహించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత, మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ భూమిపై గాలి ఉన్నన్ని రోజులు బాలు గొంతు ఉంటుందని, వారు అమరులని అన్నారు. దాదాపు 16 భాషల్లో దాదాపు 40 వేల పాటలు పాడి ప్రతి ఇంటిలో ప్రతి బడిలో ప్రతి గుడిలో బాలు ఒక భాగమై ఉన్నారన్నారు.

అతను శాశ్వతంగా ఉంటాడని పేర్కొన్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ వారి మొదటి సినిమా దిల్‌ సినిమా నుండి గతంలో వచ్చిన శతమానం భవతి వరకు చాలా సినిమాల్లో వారితో కలిసి పని చేసామని గుర్తుచేశారు. వారితో పాట రికార్డింగ్‌ అంటే అదనపు ఆకర్షణ అని ఆ పాటకు అందం వచ్చేదని గుర్తు చేశారు.

పాడుతా తీయగా, స్వరాభిషేకంలో వారు పిల్లలకు కేవలం స్వరాలే నేర్పకుండా సంస్కారం కూడా నేర్పేవారని గుర్తు చేశారు. వాతావరణ కాలుష్యం గురించి పిల్లలతో మాట్లాడేవారని, సామాజిక బాధ్యత గురించి పిల్లలతో మాట్లాడేవారని చెప్పారు. పెద్దలకు గౌరవం ఇచ్చే విషయంపై మాట్లాడేవారని గుర్తుచేశారు. మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆలయ ధర్మకర్త నరసింహ రెడ్డి మాట్లాడుతూ వారు చనిపోయిన విషయం నమ్మలేక ఉన్నామని అన్నారు.

మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా వచ్చిన ఆరు ఆల్బమ్స్‌లలో ప్రతి ఆల్బంలో వారు రెండు పాటలు పాడారని గుర్తు చేశారు. తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌కు కూడా బాల సుబ్రహ్మణ్యం పాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఆస్థాన గాయకులు విజయ్‌ శంకరాభరణం భైరవ ద్వీపం గీతాంజలి సినిమాల నుండి పాటలు పాడారు.

అదేవిధంగా కార్యక్రమంలో పాడుతా తీయగా, స్వరాభిషేకంలో బాలు ఫ్లూటిస్ట్‌ యుగంధర్‌ పాల్గొని తమ మురళి గానంతో బాలుకి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దిల్‌ రాజుతో పాటు నరసింహా రెడ్డి, నరాల సుధాకర్‌, బండి సాయిలు, యుగంధర్‌, విజయ్‌, రవీందర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

స్పందించకపోవడం సరికాదు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని వివిద బీడీ కంపనీలలో బీడీలు చేసే కార్మికులతో ...

Comment on the article