Breaking News

ఊరూరా బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థాయి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్‌ విట్టల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి గురువారం ప్రారంభించారు. స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జిల్లాస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్‌ విట్టల్‌ రావు, సభాధ్యక్షులుగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ దసరా పండుగ, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ఊరూరా బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయాలను వెలుగులోకి తెచ్చింది తమ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంజాన్‌కు క్రిస్మస్‌కు విందు, బట్టలు, దసరాకు అన్ని కులాల వారికి రేషన్‌ షాపుల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ చేస్తున్నారని, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నందున మన జిల్లాలో ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు.

గురువారం జిల్లాలో, శుక్రవారం మండలాలలో, శనివారం గ్రామాలలో చీరల పంపిణీ నిర్వహిస్తారని, కోవిడ్‌ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటించాలని, 60 సంవత్సరాలు నిండిన వారికి ఇంటిదగ్గర డోర్‌ డెలివరీ ఇవ్వాలని తెలిపారు. చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు పాల్గొనాల్సి ఉండేదని, సీఎం గారి రివ్యూ ఉన్నందున తిరిగి హైదరాబాద్‌ వెళ్లారని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మహిళా సోదరీ మణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ అందరి ఇళ్లల్లో జరగాలని, జిల్లాకు 5 లక్షల 46 వేల మంది 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు రేషన్‌ కార్డు ద్వారా చీరలు అందించడం జరుగుతుందన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం ఉంది కాబట్టి దాని బారిన పడకుండా పండుగ జరుపు కోవాలని, గ్రామాలలో నిబంధనలు పాటిస్తూ, కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలని, ప్రజా ప్రతినిధులు పంపిణీలో ముందుండి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

కార్యక్రమంలో నగర మేయర్‌ నీతు కిరణ్‌, ఎమ్మెల్సీలు రాజేశ్వర రావు, ఆకుల లలిత, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్డిఓ రవి, పిడి డిఆర్డిఎ, పిడి మెప్మా, నిజామాబాద్‌ డిప్యూటీ మేయర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article