సర్పంచ్‌లకు ఆ అధికారం ఉంది…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 9 వ తేదీ లోపు జిల్లాలోని అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు పూర్తి కావాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులు మరియు సర్పంచులను ఆదేశించారు.

మంగళవారం జిల్లాల్లోని ఎంపిడివోలు, ఎంపీవోలు, సర్పంచులు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. 530 గ్రామ పంచాయితీలకు 15 రోజుల్లో మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, 97 ప్రాంతాల్లో అటవీశాఖ భూములు గుర్తించి ఇచ్చామని, సర్పంచులకు పని చేయటానికి అవసరమైన అన్ని హంగులు సమకూర్చామని, ఇన్ని చేసినా గత 4 నెలల్లో వైకుంఠ ధామాలు పూర్తి చేయలేకపోయామని, ఇంకా 145 పెండింగులో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్లు సహకరించకుంటే మార్చే అధికారం సర్పంచులకు ఉన్నదని, ఇప్పటి వరకు కోటి మూడు లక్షల అడ్వాన్సులు కూడా ఇచ్చామని, అలుసుగా తీసుకోకుండా వెంటనే పూర్తిచేయాలని, పూర్తి చేయడమంటే ప్రజలకు వినియోగంలోకి తేవాలన్నారు. కంపోస్ట్‌ షెడ్లు ఇందలవాయి మండలంలో రెండు బోధన్‌, మాక్లూర్‌, సిరికొండ మండలాల్లో ఒకటి చొప్పున మొత్తం 5 పెండింగులో ఉన్నాయని అవి కూడా రాబోయే 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రకతి వనాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, అర ఎకరం ఉంటే 2 వేలు, ముప్పావు ఎకరం ఉంటే 3 వేలు, ఎకరం స్థలం ఉంటే 4 వేలు మొక్కలు నాటాలని, ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.

హరితహారంలో భాగంగా గ్రామాలలోని ప్రతి రోడ్డులో 5 మీటర్ల ఒక మొక్క నాటి, బ్రతికేలా చూడాలని, జిల్లాలో వన సేవకులకు ప్రతి రోజు ఏడున్నర లక్షలు చెల్లిస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. మొక్కలు బ్రతకని పక్షంలో సంబంధిత గ్రామ పంచాయతీ నుండి రికవర్‌ చేయడం జరుగుతుందని అన్నారు. నవంబరు 3,4,5 తేదీలలో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లత, డిఆర్‌డివో శ్రీనివాస్‌, జడ్పీ సీఈఓ గోవింద్‌, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వ్యాక్సిన్‌ నూరు శాతం సురక్షితమైనది

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16 నుండి ప్రారంభించే కోవిడు వ్యాక్సిన్‌ నూటికి ...

Comment on the article