Breaking News

వీరునికి అశ్రునివాళి

మంగళవారం భౌతిక కాయం రానున్నట్టు మంత్రి వెల్లడి

ఆర్మూర్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరునికి అశ్రునివాళి అర్పిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మాచిల్‌ సెక్టార్లో టెర్రరిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన వేల్పూర్‌ మండలం కోమన్‌ పల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్‌ కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సిపి కార్తికేయతో కలిసి పరామర్శించారు. మంత్రి మహేష్‌ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువులో చురుకుగా ఉన్న మహేశ్‌ ఇతర ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ దేశభక్తితో ఆర్మీలో చేరారని, ఎప్పుడు దేశం కోసం ఆలోచించేవాడని గ్రామస్తులు తెలిపారన్నారు. 26 ఏండ్ల చిన్న వయసులోనే భరతమాతను శత్రువుల నుండి రక్షించే బాధ్యతను పూర్తిగా నిర్వహించాడని ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చడంలో తాను భాగస్వామి అయ్యాడని ఇందులో భాగంగా తన ప్రాణాలను సైతం అర్పించాడని పేర్కొన్నారు. భరతమాత ఒడిలో ఒరిగిపోయిన ఆ వీరునికి అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

మహేశ్‌ కుటుంబానికి తన తరఫున, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని వీర జవాన్‌ ప్రాణాలకు వెలకట్టలేకపోయినా ఆయన ప్రాణాలను తీసుకురాలేకపోయినా అతని కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా అండగా ఉంటారని తెలిపారు. వేల్పూర్‌ వాసిగా తనవంతుగా ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరతమాత రక్షణ కోసం ఆయన చేసిన త్యాగాన్ని చిరస్థాయిగా గుర్తుంచుకుంటామని కుటుంబ సభ్యులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని గద్గద స్వరంతో తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయం హైదరాబాద్‌ రానున్నదని సగౌరవంగా మహేశ్‌ అంతిమ యాత్ర ఇక్కడ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, వీర జవాన్‌ మరణం విషాదకరమైనప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని భారతీయులందరూ గర్వించదగ్గ విషయమని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ శ్రీనివాస్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

భక్తుల‌ రద్దీతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట

ఆర్మూర్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచ‌ల‌ ...

Comment on the article