Breaking News

అభివృద్ధి పనులు ఆగకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న చిన్న కారణాలతో అభివృద్ధి పనులు ఆగకుండా వెంటనే పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వాటికి అవసరమైన ఇసుక, స్థల సేకరణ సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌ నుండి సంబంధిత అధికారులతో ఎంపీ లాడ్స్‌, సిడిపి, ఎస్‌డిఎఫ్‌, రూర్బన్‌ పనుల అభివద్ధిపై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014- 15 సంవత్సరం నుండి ఇంకా కొన్ని పనులు పూర్తి కావలసి ఉందని, ప్రజా నిధులతో వెచ్చించిన పనులను సమస్యలను అధిగమించి ప్రారంభించి వెంటనే పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భూమి సేకరణ సమస్య ఉన్న చోట ఆర్డీవోలు, తహసీల్దార్లు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇసుక అవసరమైన పనులకు ఎంత ఇసుక అవసరమైతే ఆ మొత్తం ఒకేసారి అప్పగించాలని, నిర్మాణాలకు ఇసుక సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ అభివద్ధి పనుల ఇసుకను కాంట్రాక్టర్లు డైవర్ట్‌ చేస్తే సంబంధిత ఏజెన్సీ శాఖ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరించారు. భూ, ఇసుక సమస్యలు వెంటనే పరిష్కరించి నూటికి నూరు శాతం పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎంపీ లాడ్స్‌, సిడిపి, లేదా ఇతర నిధుల నుండి ఏ రకమైన పనులు ఏ గ్రామానికి మంజూరు చేశారో వాటిని ఎట్టి పరిస్థితిలోనూ మార్చడానికి వీలు లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని, ఒకవేళ అదే గ్రామంలో మరోచోట ఆ పని చేయవలసి ఉంటే గ్రామపంచాయతీ తీర్మానం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మంగళవారం నుండి వారం రోజుల్లోగా ఆ పనులకు ఇసుక పంపించాలని రేపటి నుండి పనులు కూడా ప్రారంభించాలని తెలిపారు. రూర్బన్‌ పనులకు అవసరమైన ఇసుక సమస్య తీరినందున పనులను వెంటనే ప్రారంభించి డిసెంబర్‌ చివరికల్లా పూర్తిచేయాలని పేర్కొన్నారు.

అదేవిధంగా క్రిమటోరియం, రైతు వేదికల పనులు కూడా వెంటనే పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాటితో పాటు ధాన్యం ఆర పోసుకునే డ్రయింగ్‌ ప్లాట్‌ఫారాలు పూర్తిచేయడానికి ఒక డ్రైవ్‌ లాగా చేపట్టాలని వాటిని వారంలోగా ప్రారంభించి డిసెంబర్‌ 15 వరకు పూర్తిచేయాలని, తద్వారా రైతులకు ధాన్యం రోడ్లపైన ఆర పోసుకునే అవసరం ఉండదని, వాహనాలతో వెళ్లే ప్రయాణికులకు రోడ్లపైన వరికుప్పల వల్ల ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు.

ఏపీఓలు ఈ విషయంలో బాధ్యత తీసుకొని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. సంబంధిత శాఖల వాట్సాప్‌ గ్రూపులలో వచ్చే పై అధికారులు, జిల్లా అధికారుల మెసేజ్‌లు చూసి వెంటనే వారి స్పందన, అవసరమైన సమాచారం పోస్ట్‌ చేయాలని స్పందించకపోవడం అంటే నిర్లక్ష్యంగా భావించడమే అవుతుందని కొందరు పట్టించుకోకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్‌ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఆర్‌డివోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, డిపిఓ, సిపిఓ, తహసిల్దార్లు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ డిఈలు, ఈఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పరీక్షలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం, ...

Comment on the article