నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని రైతులకు మంజూరు చేసిన 3 వేల 600 వ్యవసాయ కల్లాలను వారం రోజుల్లో పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా యాసంగి పంట రుణాల కోసం బ్యాంకర్లను కలవాలని, శాస్త్రవేత్తల సూచనల మేరకే రసాయన ఎరువులను వాడి పెట్టుబడిని తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా రైతులను ఒక ప్రకటన ద్వారా కోరారు. వానాకాలం సీజన్ పూర్తయ్యే దశలో ఉన్నందున పంట వ్యర్థాలైన గడ్డి కానీ ఇతరత్రా చెత్త కానీ ఒకచోట వేసి కాల్చాలని లేదంటే హరిత హారంలో లేదా రైతులు స్వయంగా నాటిన మొక్కలు కూడా కాలిపోయే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని రైతులు వ్యవసాయ కల్లాలు ఏర్పాటు చేసుకోవడానికి 3 వేల 600 మంది రైతులకు మంజూరు చేయడం జరిగిందని ఇందులో ఎస్సి, ఎస్టిలకు 100 శాతం రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలుపుతూ ఈ అన్నింటిని కూడా వారం రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. మంజూరైన వారిలో ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే వారి స్థానంలో ముందుకు వచ్చే వారికి మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. యాసంగి కొరకు పంట రుణాలు రెన్యూవల్ చేసుకోవడానికి రైతులు బ్యాంకర్లను కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రుణమాఫీ పథకానికి రుణాల రెన్యువల్‌కు ఎటువంటి సంబంధం లేదని లక్ష రూపాయలు రుణానికి రెన్యువల్ చేసుకుంటే తొమ్మిది శాతం వడ్డీ తగ్గి 7 నుండి 9 వేల రూపాయల వరకు రైతులకు మిగులుతాయని అంతేకాని రుణమాఫీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు రసాయన ఎరువులను అవసరానికి మించి వాడుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారని, కానీ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు చెప్పే వివరాల ప్రకారం మోతాదుకు మించి ఎరువులు ఎక్కువ వాడినప్పటికీ దిగుబడిలో ఎటువంటి తేడా ఉండదని మరియు అదనంగా ఉపయోగించిన ఎరువుల ఖర్చు రైతులు అదనంగా పెట్టుబడి కింద ఖర్చు చేసుకుంటున్నారని తెలిపారు. కావున వ్యవసాయ అధికారుల శాస్త్రవేత్తల సూచనల మేరకే ఎరువులు వాడాలని కలెక్టర్ ప్రత్యేకంగా కోరారు. వ్యవసాయ పనులకు యంత్రాల ఉపయోగంపై ఆయా కంపెనీలతో రైతులకు త్వరలోనే అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆ విషయాలు త్వరలోనే తెలుపుతామని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలకు రైతులు హాజరై యంత్రాల ఉపయోగంపై తద్వారా రైతుకు చేకూరే లాభాలు, అనుకూలతలపై అవగాహన ఏర్పరచుకొని మంచి దిగుబడులను పొందడంతోపాటు ఖర్చులను తగ్గించుకునే దిశగా ఆలోచించాలని కోరారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ప్రారంభానికి సిద్ధం చేశాం… - January 28, 2021
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021