నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెన్నై షాపింగ్ మాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇప్పించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల బట్టల దుకాణ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన చెన్నై షాపింగ్ మాల్లో సుమారు 400 మందికి పైగా కార్మికులు ఆగస్టు 15 నుండి పని చేస్తున్నారన్నారు. మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ కార్మికులకు పూర్తిస్థాయి వేతనాలు ఇవ్వలేదన్నారు. కేవలం 50, 60 మందికి పూర్తి వేతనాలు ఇచ్చి, మిగతా వారికి ఇష్టారీతిన కోతలు విధించి, 30 శాతం వేతనం మాత్రమే ఇచ్చారన్నారు.
కార్మికుల బ్యాంక్ పాస్ బుక్, ఏటీఎం కార్డులు సైతం యాజమాన్యమే లాక్కుందన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 వరకు నిలబడే కార్మికులు పని చేయాల్సిన దుర్మార్గ పరిస్థితి ఉందన్నారు. గిరాకీ లేని సమయంలో వర్కర్లు కూర్చునే అవకాశం లేదన్నారు. ప్రశ్నించిన వాళ్లను బెదిరింపులకు, భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కార్మికుల పట్ల చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఆగస్టు 15 నుండి కార్మికులకు రావలసిన వేతనాలు ఇప్పించాలన్నారు.
బ్యాంక్ పాస్ బుక్, ఏటీఎంలు తిరిగి ఇచ్చేయాలన్నారు. నిర్దిష్ట పనిగంటల తర్వాత అధిక పనిగంటలకు, అధిక వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికుల హక్కుల, చట్టాల ఉల్లంఘనపై యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని బట్టల దుకాణాల్లో కార్మికులకు కుర్చీలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే చెన్నై షాపింగ్ మాల్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, నాయకులు విటల్, చరణ్, అశుర్, సాయితేజ పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ప్రారంభానికి సిద్ధం చేశాం… - January 28, 2021
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021