Breaking News

అక్కడ మొత్తం సర్పంచ్‌ భర్త పెత్తనం

గాంధారి, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అదో చిన్న గ్రామపంచాయతీ.. అక్కడ వారు దొరలు… ఆ పంచాయతీకి సర్పంచ్‌ జనరల్‌ మహిళా రిజర్వు కావడంతో ఎన్నికలలో దొరల కుటుంబంలోని మహిళ గెలుపొందారు. అప్పటినుండి వారు దొరలు కావడంతో సర్పంచ్‌ భర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. గ్రామ పంచాయతీలో పెత్తనం అంతా ఆయనదే. ఈ విషయమై లోకాయుక్తలో పిర్యాదు వెళ్లగా కేసు నమోదు అయింది.. వివరాల్లోకి వెళితే….

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో తిమ్మాపూర్‌ అనే గ్రామ పంచాయతీ ఉంది. ఈ పంచాయతీకి మరో మూడు గ్రామాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికలలో గ్రామానికి చెందిన సానెం పరమేశ్వర్‌ రెడ్డి భార్య సానెం శోభ గెలుపొందారు. అప్పటి నుండి సర్పంచ్‌ భర్త పరమేశ్వర్‌ రెడ్డి సర్పంచ్‌గా చెలామణి అవుతూ ఉన్నారు..గ్రామపంచాయతీలో ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలలో ఆయనే పాల్గొంటున్నారు.

ఇది తెలిసి అధికారులు సైతం నోరు మెదపలేక పోతున్నారు. అధికారికంగా ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలలోను సర్పంచ్‌ స్థానంలో ఆయనే పాల్గొంటున్నారు. ప్రభుత్వ పతకాలు పేదలకు అందించే ప్రతీ కార్యక్రమంలో ఆయనే ప్రత్యక్షం అవుతాడు. కల్యాణ లక్ష్మి పంపిణి, నూతన పట్టాపాసు పుస్తకాల పంపిణి, చెరువులలో చేపపిల్లల పంపిణిలలో సర్పంచ్‌ స్థానంలో భర్త పాల్గొంటారు. అవే కాకుండా ప్రభుత్వం చేపట్టిన స్మశాన వాటిక నిర్మాణ భూమి పూజలో ఆయనే, హరితహారం కార్యక్రమంలో ఆయనే, స్వచ భారత్‌లోను ఆయనే కనిపిస్తాడు…

గ్రామ సభలో ఆయనదే పెద్దరికం.. ప్రతి మూడు నెలలకు గ్రామ పంచాయతీ లో నిర్వహించే గ్రామ సభలో సర్పంచ్‌ మహిళ స్థానంలో భర్త పరమేశ్వర్‌ రెడ్డి కూర్చొని ఆయనే సర్పంచ్‌గా వ్యవహరించడం, ఎదురు తిరిగిన సభ్యులను, ప్రజలను బెదిరింపులకు గురిచేయడం అయన నైజం. గ్రామపంచాయతీలో సమస్యల పరిష్కారం కోసం గ్రామ ప్రజలు జీపీకి వస్తే, సమస్యలు వినకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడని గ్రామ ప్రజలు వాపోయారు. ప్రజలు సమస్యలు పరిష్కరించాలని అడిగితే మీ ఇంటి కరెంటు కట్‌ చేయిస్తాను, వాటర్‌ కట్‌ చేయిస్తా, రేషన్‌ రాకుండా చేస్తా, పెన్షన్‌ రాకుండా చేస్తా అని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వారు తెలిపారు.

ఇప్పటి వరకు సర్పంచ్‌ సానెం శోభా గ్రామంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన లేదని అన్నారు. ఈ విషయమై ఎన్ని సార్లు మండల స్థాయి అధికారులకు, నాయకులకు తెలిపిన ఎలాంటి చర్యలు లేవని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంలో సర్పంచ్‌ పై కానీ ఆమె భర్త పై కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో హైదరాబాద్‌లో లోకాయుక్తలో పిర్యాదు చేశారు.

హైదరాబాద్‌లో చదువుకుంటున్న గ్రామానికి చెందిన న్యాయ విద్యార్థి, సౌత్‌ ఇండియా ఓయూ జేఏసీ కన్వీనర్‌ శ్రవణ్‌ కుమార్‌ ద్వారా పిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన లోకాయుక్త కామారెడ్డి డీపీఓకు విచారించాలని ఆదేశాలు జారీ అయినట్లు శ్రవణ్‌ కుమార్‌ తెలిపారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించాలి..మండలంలో అనేక గ్రామపంచాయతీలలో మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు, లేకపోతే మహిళా సర్పంచ్‌ల కొడుకులు సర్పంచ్‌లుగా చెలామణి అవుతున్నారు. అధికారులు స్పందించి మహిళ సర్పంచ్‌ల విలువలు పెంచి వారికి గౌరవం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు..

Check Also

మాతు సంగెంలో కుస్తీ పోటీలు

గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ...

Comment on the article