Breaking News

కోవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి సిద్ధం కండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెలలో వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు అందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ లత కోరారు. గురువారం జిల్లా అధికారులతో ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్‌కు సిద్ధం కావడంపై జిల్లాస్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు.

జనవరిలో వ్యాక్సిన్‌ రానున్నట్లు తెలుస్తున్నందున అందుకు సంబంధించి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకుగాను సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయి సహకారం అందించి ఈ ప్రక్రియ జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌ రాగానే ముందుగా ఆరోగ్యశాఖ సిబ్బందికి, ఐసిడిఎస్‌, మున్సిపల్‌ తదితర ప్రాధాన్యత శాఖలకు అందించనున్నందున అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

వ్యాక్సిన్‌ వేయడానికి సంబంధిత సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చినందున ఈ విషయంలో పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి 28 రోజుల గ్యాప్‌తో వ్యాక్సిన్‌ రెండు డోసులుగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల అక్కడక్కడ సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఇది సర్వసాధారణమే అని గతంలో పోలియో తదితర వ్యాక్సిన్లు ఇచ్చినప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమించడం జరిగిందని కావున ఎవరు కూడా ఎక్కువగా గాభరా పడవలసిన అవసరం లేదన్నారు.

సమావేశంలో డిఎం అండ్‌ హెచ్‌వో సుదర్శనం, డిఐఓ శివ శంకర్‌, డబ్ల్యుహెచ్‌వో కన్సల్టెంట్‌ అతుల్‌, జిల్లా పరిషత్‌ సిఈవో గోవిందు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సిబ్బంది

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం ...

Comment on the article