రైతువ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ ఆలీ షబ్బీర్‌ పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసే కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రుభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు.

రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఢిల్లీలో చలితో మ త్యువాత పడుతున్నా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వారి మరణానికి కారణమైందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలని చూస్తూ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. వరి, మొక్క జొన్న, కంది, వేరుశనగ తదితర పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని కేసీఅర్‌ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.

కొనుగోలు కేంద్రాలు వచ్చే యాసంగి నుంచి ఏర్పాటు చేయబోమని చెప్పడంతో రైతుల్లో తీవ్ర అందోళన మొదలైందన్నారు. కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే భారీగా అందోళనలు చేపడుతామని షబ్బీర్‌ అలీ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను అడ్డుపెట్టుకొని పార్లమెంట్‌లో రైతులకు వ్యతిరేకంగా బిల్లులు ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయనిమచ్చ అని విమర్శించారు.

వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయించి నిర్బందించడం అమానుషమన్నారు. కార్పొరేట్‌ శక్తుల కోసమే కేంద్రం చట్టాలు తెచ్చిందని ఆయన ఆరోపించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ రంగాలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ నూతన చట్టాలను తెచ్చిందని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను వీడాలని కోరారు. త్వరలో రైతుల కోసం ప్రాణహిత-చేవెళ్ల 21, 22 ప్యాకేజీల గురించి పాదయాత్ర చేపడతామన్నారు.

Check Also

కామారెడ్డిలో రంగోళి పోటీలు

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ...

Comment on the article