Breaking News

వ్యాక్సిన్‌ నూరు శాతం సురక్షితమైనది

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16 నుండి ప్రారంభించే కోవిడు వ్యాక్సిన్‌ నూటికి నూరు శాతం సురక్షితమైనదని ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు- భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 16 నుండి ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులకు కోవీడు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నందున తగిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మంత్రి అధ్యక్షతన మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పది నెలలుగా కరోనా వ్యాధి వల్ల ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మూడు నాలుగు నెలలు లాక్‌ డౌన్‌ సమయంలో మరెన్నో కష్టాలు అనుభవించారని ఇప్పుడు కరోనాకు చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఇన్ని రోజులుగా కరోనాను అరికట్టడానికి గ్రామ గ్రామాన వాడవాడలా వైద్య ఆరోగ్య శాఖ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్‌, ఐసిడిఎస్‌ తదితర శాఖల ఉద్యోగులు, అధికారులు ముందు వరుసలో ఉండి శక్తివంచన లేకుండా కషి చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇన్ని రోజులుగా కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ కనుగొనడానికి శాస్త్రవేత్తలు చేసిన కషి ఫలించి ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి అవకాశం వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షలు నిజామాబాద్‌ జిల్లాలో 15వేల మంది ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ ఈనెల 16 నుండి వ్యాక్సిన్‌ అందించడానికి యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాదులోని భారత్‌ బయోటెక్‌, పూణేలోని సిరం కంపెనీల ఆధ్వర్యంలో సిద్ధం చేయబడిన వ్యాక్సిన్‌ అందించనున్నారని తెలిపారు.

వ్యాక్సిన్‌ పనితనంపై ఎన్నో స్థాయిలో శాస్త్రవేత్తలు కమిటీలు పలుమార్లు పరీక్షలు చేసి ప్రయోగాలు చేసి సురక్షితమైనదని నిర్ధారించుకున్న తర్వాతనే దీనిని ప్రజలకు అందించడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, వ్యాక్సిన్‌ నూటికి నూరుపాళ్లు సురక్షితమైనదని మంత్రి స్పష్టం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

ఈనెల 16 నుండి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు అందించే వ్యాక్సిన్‌కు 40 కేంద్రాలు ఎంపిక చేయడం జరిగిందని మొదటి విడతలో పార్ట్‌ ఎ లో 15 వేల డోసులు ఇవ్వనున్నామని, ప్రతి సెంటర్‌లో మొదటి రోజుకు 30 మందితో ప్రారంభించి తర్వాత రోజుల్లో సంఖ్యను పెంచనున్నామని వివరించారు. 16న జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాలు, నిజామాబాద్‌ టౌన్‌లో 5 కేంద్రాలు బోధన్‌ టౌన్‌లో ఒక కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ఇస్తున్నామన్నారు.

వ్యాక్సిన్‌ అందించే కేంద్రాల్లో వేచి ఉండడానికి, వ్యాక్సిన్‌ ఇవ్వడానికి, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని అబ్జర్వ్‌ చేయడానికి మొత్తం మూడు గదులు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి కేంద్రంలో ఒక అంబులెన్సు సిద్ధంగా ఉంచుకోవాలని వ్యాక్సిన్‌ వేసిన తర్వాత సమస్యలు తలెత్తకుండా యాంటీ రియాక్షన్‌ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, కేసును బట్టి ఏరియా ఆసుపత్రికి లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించడానికి కలెక్టరేట్‌లో, ప్రభుత్వ ఆసుపత్రిలోను డివిజన్‌ స్థాయిలోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సర్పంచ్‌ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వ్యాక్సినేషన్‌ ప్రారంభానికి వారిని ఆహ్వానించాలని, వారిచేత లాంచింగ్‌ చేయించాలని తద్వారా కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని స్థాయిల్లోనూ అధికారులు సిబ్బంది కషి చేయాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని ఆయన సూచించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ 16వ తేదీన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ అందించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేశామని అధికారులకు అవసరమైన అన్ని ఆదేశాలు జారీ చేశామని జిల్లాస్థాయి అధికారులను 40 కేంద్రాలలో ఇన్‌చార్జిగా వ్యవహరించడానికి ఆదేశాలు జారీ చేశామని ఎక్కడ కూడా పొరపాట్లకు తావులేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సూచనలు చేయడం జరిగిందని వివరించారు.

స్థానిక ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా మాట్లాడుతూ కరోనాకు తాను కూడా బాధితుడినేనని వ్యాధి తొందరగా తొలగిపోవాలని కోరుకుంటున్నానని ఇన్ని రోజుల పాటు ముందుండి ప్రజలకు సేవ చేసిన ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి కతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎన్‌డిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌లు చంద్ర శేఖర్‌, లత, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, డిఎమ్‌ హెచ్‌ఓ సుదర్శనం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతి మారాజ్‌, వైద్యాధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article