జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర మానవ వనరుల అభివద్ది సంస్థ, యూనివర్సిటి గ్రాంట్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి, సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ నీతూ కుమారి ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలలో పీజీ కోర్సులకు ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి భౌతికం (ఆఫ్ లైన్) గా చివరి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ పేర్కొన్నారు.
అదే విధంగా బాలికలు, బాలుర హాస్టల్స్లో నివాస వసతి (బోర్డింగ్) మరియు భోజన వసతి (మెస్) కూడా ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం తన ప్రిన్సిపల్ చాంబర్లో వివిధ విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రతిపాదనలు రూపొందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు భౌతికంగా తరగతులకు హాజరు (హాజరు తప్పనిసరి కాదు) అయ్యే ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సి) ధ్రువీకరించిన రాపిడ్ ఆక్టీవ్ టెస్ట్ (ఆర్ఏటి) కొవిద్ – 19 నెగిటీవ్ రిపోర్ట్ తప్పనిసరిగా కళాశాలలో సమర్పించి అనుమతి తీసుకోవలసి ఉంటుందన్నారు.
అదే విధంగా కళాశాలకు హాజరయ్యే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కొవిద్ – 19 భవిష్యత్ ప్రభావానికి సంబంధించి పూచీకత్తు మరియు స్వ ప్రకటన (అండర్ టేకింగ్ / సెల్ఫ్ డిక్లరేషన్) తప్పనిసరిగా అందించాలని అన్నారు. కొవిద్ -19 స్టాండెడ్ ఆపరేషన్ ప్రొసిజర్ (ఎస్వోపి) ప్రకారం కళాశాల పరిసర ప్రాంతాలను సమగ్ర శానిటైజేషన్, క్యాంపస్ బాహ్య ప్రదేశంలో నిర్ణీత భౌతిక దూరంతో సంచారం, తరగతి గదుల్లో నిర్ణీత భౌతిక దూరంతో సీటింగ్ పద్ధతి, హాస్టల్స్ గదుల్లో నిర్ణీత భౌతిక దూరంతో పడకల ఏర్పాటు, భోజనాల గదిలో నిర్ణీత దూరంతో క్యూలైన్ పద్ధతి, ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం వంటి నియమాలను పాటించాలని సూచించారు.
విశ్వవిద్యాలయ పాఠ్యప్రణాళికల సమయసారిణి (2020-21) ని అనుసరించే ప్రస్తుత విద్యాసంవత్సరం పీజీ కోర్సులలో తరగతులు, పరీక్షలు నిర్వహింపబడుతాయని తెలిపారు. పీజీ కోర్సులలో చివరి సంవత్సరం భౌతికంగా తరగతికి హాజరు కాని విద్యార్థులకు మరియు చివరి సంవత్సరం గాక ఇతర తరగతులు (మూడేళ్ల కోర్సులు, ఐదేళ్ల కోర్సులకు చెందిన రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం) విద్యార్థులకు యదావిధిగా ఆన్ లైన్ తరగతులు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
కావున కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సంప్రదించవలసిందిగా ఆయన సూచించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021