Breaking News

బిసిల‌ అభివృద్దిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ సర్కారుకు బీసీ ఓట్ల పై ఉన్న ప్రేమ వారి అభివృద్ధిపై ఏమాత్రం లేదని, టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లో బీసీల‌ విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి ఎలాంటి చర్యులు తీసుకోవడం లేదని, బీసీల‌ అభివృద్ధి పట్టించుకునే సమయం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్‌ కుమార్‌, బీసీ మోర్చా ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షుడు బాశెట్టి రాజ్‌ కుమార్‌ అన్నారు.

శనివారం ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో వారు మాట్లాడారు. కొత్త స్కీములు ప్రవేశ పెట్టడం లేదు, వాటిని అమలు చేయడం లేదని, బీసీల‌ను అనగతొక్కడం, రిజర్వేషన్లు తగ్గించడమే తప్ప బీసీల‌ అభివృద్ధికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీల‌ను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కే కార్యక్రమం చేపట్టినట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల‌ ముందు బిసి కులాల‌కు ఒక్కొక్కరికి ల‌క్ష నుండి పది ల‌క్షల‌ వరకు రుణాలు ఇస్తామని, బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఐదు ల‌క్షల‌ వరకు అప్లికేషన్లు తీసుకొని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం టిఆర్‌ఎస్‌ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో వివిధ శాఖల్లో రెండు ల‌క్షల‌ పైన ఖాళీలు ఉన్నాయని తెలిసినా భర్తీ చేస్తే 90 శాతం ఖాళీలు బిసి, ఎస్సీ, ఎస్టీల‌కు భర్తీ అవుతాయని ఆందోళన చెందిన కేసీఆర్‌ ప్రభుత్వం ఇట్టి నియామకాల‌ను చేయకుండా ఆపేయడం బీసీల ‌పట్ల ఉన్న కపట ప్రేమకు నిదర్శనమని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇటీవలే సెక్రటేరియట్‌ను కూల్చి మళ్లీ కట్టడానికి వంద కోట్లు, అదేవిధంగా అసెంబ్లీని కూల్చి కొత్తది కట్టడానికి బడ్జెట్‌, ప్రతి జిల్లాకు, నియోజకవర్గానికి ఎమ్మెల్యే భవనాలు కట్టించడానికి డబ్బు ఉంటాయి కానీ, బీసీ హాస్టల్‌, బిసి రెసిడెన్షియల్‌ కాలేజీలు కట్టడానికి బడ్జెట్‌ ఉండదా అని ప్రశ్నించారు.

ఇంజనీరింగ్‌ కాలేజీలో చదివే బీసీ విద్యార్థుల‌కు ల‌క్షల్లో ఫీజు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు మంజూరు చేసి చేతులు దులుపుకోవడం బీసీ విద్యార్థుల‌ పై ఉన్నటువంటి సవతి ప్రేమను చూపిస్తా ఉందని, బిసి(సి) గ్రూపులోని క్రిస్టియన్లకు, బీసీ(ఈ) గ్రూపులోని ముస్లింల‌కు పూర్తి ఫీజు, బకాయిలు మాఫీ చేస్తూ, బీసీ లో ఉన్నటువంటి హిందూ బీసీల‌కు పూర్తిస్థాయి ఫీజులు ఇవ్వకపోవడం హిందూ బీసీల‌పై ఉన్నటువంటి నైజం తెలియజేస్తుందన్నారు.

చదువుకొని బిసిలు ఉన్నత స్థాయిలో ఉండాల‌నుకోవడం కేసీఆర్‌ కు ఇష్టం లేనట్టుగా ఉందని, అందుకే బీసీల‌ను గొర్రెలు, బర్రెలు ఇస్తున్నారు తప్ప విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వీరికి సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, శాలివాహన, వాల్మీకి, వడ్డెర, మేదర, పూస, బట్రాజు మొదలైన 14 ఫెడరేషన్లకు బడ్జెట్‌ ఇవ్వలేదని, అంతేకాకుండా ముదిరాజ్‌, గొల్ల‌, కురుమలు, మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, బలిజ, పట్కరిల‌కు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల‌ని భారతీయ జనతా పార్టీ, బిసి సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేసినప్పటికీ పట్టించుకునే సమయం కేసీఆర్‌ ప్రభుత్వానికి లేదా అన్నారు.

తెలంగాణలో 54 శాతం బీసీ కుల‌స్తులు ఉంటే 119 ఎమ్మెల్యేల‌కు 53 మంది ఎమ్మెల్యేలు అగ్రకులాల‌ వాళ్లని, బీసీ లో 109 కులాలు ఉంటే ఇప్పటికీ 90 కులాల‌ వ్యక్తులు అసెంబ్లీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవని, రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా వారిని కెసిఆర్‌ ప్రభుత్వం మాయమాటలు చెప్పి తన కాళ్ళ కింద బతికే విధంగా ఉంచి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి బిసి వ్యక్తి అయిన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిందని, రాష్ట్రంలో ఓ బీసీ వ్యక్తి అయిన బండి సంజయ్‌ని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుగా చేసిందని, మన నిజామాబాద్‌ జిల్లా నుండి ఓ బిసి వ్యక్తి అయిన ధర్మపురి అరవింద్‌ని ఎంపీగా చేసిందని, జిల్లా బిజెపి అధ్యక్షులుగా ఓ బిసి వ్యక్తి అయిన బస్వా ల‌క్ష్మీ నరసయ్యని నియమించిందని, అంతేకాకుండా రాబోయే కాలంలో తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఓ బీసీ నాయకుడే అవుతాడని, ఇది ఒక బీజేపీ తోనే సాధ్యమన్నారు.

తెలంగాణలో ఉన్నటువంటి బిసి కుల‌స్తుందరూ ఏకమై వెల‌మ‌ దొర గడిని కూల్చి, కెసిఆర్‌ గద్దె దించే భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల‌ని తెలిపారు. సమావేశంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్‌, బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శులు కిరణ్‌, దినేష్‌. బిసి మోర్చా ఉపాధ్యక్షులు రవి, శ్యామ్‌, రాము, శ్రీకాంత్‌, రమణ, బిసి మోర్చా కార్యదర్శి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article