Breaking News

నిరుద్యోగుల‌ను నిండా ముంచిన ఘనత కేసీఆర్‌దే

కామారెడ్డి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయి అని భావించిన నిరుద్యోగుల‌కు కన్నీళ్లు , ఆత్మహత్యలే మిగిలాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ నుండి ఆంధ్ర ఉద్యోగుల‌ను తరిమి కొడదామని, రాష్ట్రం వస్తే ల‌క్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఉద్వేగ ప్రసంగాల‌తో యువకుల‌ను నిరుద్యోగుల‌ను రెచ్చగొట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేకపోవడంతో రాష్ట్రంలోనే ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నేటి బంగారు తెలంగాణలో నెల‌కొందన్నారు.

బంగారు తెలంగాణగా కేసీఆర్‌ కుటుంబం మాత్రమే అయ్యిందని, కెసిఆర్‌ నియంతృత్వ ధోరణితో రాష్ట్రంలో ఉన్నత విద్యావంతులు అడుక్కుతినే పరిస్థితికి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కెసిఆర్‌ విధానాల‌ను గమనిస్తున్న తెలంగాణ ప్రజలు ఇటీవల‌ జరిగిన దుబ్బాక ఎన్నికల్లో ఓడించారని అదే రకమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తెలంగాణ అంతటా కనబడుతుందని హెచ్చరించారు.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ మరి దుబ్బాక ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాల‌న్నారు. మీరు ఇచ్చే పెన్షన్ల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు విద్యార్థులు ఆత్మబలిదానాలు చెయ్యలేదని బంగారు భవిష్యత్తు కోసం పోరాటాలు చేస్తే కేసీఆర్‌ కుటుంబంలోని వారికే బంగారు భవిష్యత్తు ఏర్పడిందన్నారు. త్వరలోనే ల‌క్ష ఉద్యోగాల‌ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడతామన్నారు.

Check Also

సోమవారం నుండి సాధారణ ప్రజల‌కు కరోనా వ్యాక్సిన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 60 సంవత్సరాలు దాటిన వారికి, అదేవిధంగా 40 సంవత్సరాలు ...

Comment on the article