Breaking News

మొక్కలు నాటి జన్మదిన బహుమతిగా ఇవ్వాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి వృక్ష ప్రేమికుడని, మొక్కల‌న్నా చెట్లన్నా ఆయనకు అమితమైన ఇష్టమని, ఆయన జన్మదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటి బహుమతిగా అందించాల‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వేల్పూరు మండల‌ కేంద్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అకుంఠిత దీక్షతో తెలంగాణలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యమంలా తీసుకుపోయి గత ఆరు సంవత్సరాలుగా మొక్కలు పెంచడం ద్వారా తెలంగాణలో 4.7 శాతం ప్రాంతం గ్రీన్‌ కవరేజ్‌ పెరిగిందన్నారు. ఈ సమకాలీన పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మొక్కలు పెంచలేదన్నారు. హరితహారం కారణంగానే రాష్ట్రంలో రెండు మూడు సంవత్సరాలుగా బాగా వర్షాలు పడుతున్నాయని ముఖ్యమంత్రి కోరిక మేరకు ఇంకా నాలుగు శాతం గ్రీనరీ పెంచగలిగితే తెలంగాణకు వర్షాల‌ సమస్య ఉండదన్నారు.

దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాలో ఎప్పుడూ వర్షాలు పడతాయి. అట్లా తెలంగాణలో కూడా వర్షాలు పడుతుంటాయి. తెలంగాణ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో గ్రీనరీ కొరకు 10 శాతం బడ్జెట్‌ పెట్టి గ్రామ పంచాయతీలో, పట్టణాల‌లో ఆదాయంలో 10 శాతం పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. బ్రహ్మాండంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చెట్లు పెంచుతున్నారని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ అని చెట్లు పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నారన్నారు.

గ్రీన్‌ ఛాలెంజ్‌ అనే కార్యక్రమం సెల‌బ్రిటీలు అందరూ చెట్ల విలువను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచుతూ ఉన్నారు. ఫారెస్ట్‌ రైజనైషన్‌ అనే ప్రోగ్రాంలో అడవిలో చెట్లు సరిచేయడం చెట్లు పెంచడం వంటి కార్యక్రమంతో ఒక్కొక్క సెల‌బ్రిటీ కి 100 నుండి రెండు వందల‌ ఎకరాలు దత్తత తీసుకొని చెట్లు పెంచే విధంగా వారికి ప్రోత్సహించడం వల‌న ఈ రోజు హైదరాబాద్‌ చుట్టుపక్కల ల‌క్ష ఎకరాల‌ ఫారెస్ట్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా సంతోష్‌ కుమార్‌ చేపట్టారని, వారు చరిత్రలో నిలిచి పోతారన్నారు.

చెట్లు పెంచాలి హరితవిప్లవం తీసుకురావాలి సమాజానికి భావితరాల‌కు మంచి జరగాలే ఎల్ల‌ప్పుడూ లాభం చేసే పని గ్రీన్‌ ఛాలెంజ్లో భాగంగా ముఖ్యమంత్రి వృక్ష ప్రేమికుడు కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటుదామని పిలుపునిస్తూ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలు మంచిగా ఎదగాల‌ని సమాజానికి మంచిగా అన్ని రకాల‌ ఉపయోగాలు ఉండాల‌ని కోరుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటి మొత్తం కోటి మొక్కలు నాటి కెసిఆర్‌కు జన్మదిన బహుమతి ఇవ్వాల‌న్నారు.

అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎవిన్యూ ప్లాంటేషన్‌ క్రింద నాటిన నాలుగువందల‌ పండ్ల మొక్కల‌కు హార్ట్ క‌ల్చ‌ర్‌ శాఖ ద్వారా డ్రిప్‌ సిస్టం ఏర్పాటు చేయించాల‌ని కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ స్టాప్‌ మహిళా సంఘాల‌ అందరి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటుతున్నామని ముఖ్యమంత్రికి మొక్కలు అంటే చాలా ఇష్టమని, వారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వం తరపున ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చెట్లు బాగా ఉన్నప్పుడే ఆ ప్రాంతంలో వాతావరణ సమతుల్య‌త ఉంటుందన్నారు.

వర్షాలు, తేమ, ఉష్ణోగ్రత సమతుల‌ స్థాయిలో ఉంటుందన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా కోవిడ్‌ చికిత్సలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు నిజామాబాద్‌ ముందు ఉన్నందున మంత్రి జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి, జిల్లా అధికారులు డిఆర్‌డిఓ శ్రీనివాస్‌, డిఎం హెచ్‌ఓ సుదర్శనం, ఆర్డిఓ శ్రీనివాస్‌, ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌ మహిళా సంఘాలు, వివిధ శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు మట్టిలో మాణిక్యం, స్వతంత్ర సమరయోధుడు, నిజాం రజాకార్లను ...

Comment on the article