Breaking News

సోమవారం నుండి సాధారణ ప్రజల‌కు కరోనా వ్యాక్సిన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 60 సంవత్సరాలు దాటిన వారికి, అదేవిధంగా 40 సంవత్సరాలు దాటి ఆరోగ్య సమస్యలు ఉన్న సాధారణ ప్రజల‌కు సోమవారం నుండి కరోనా వ్యాక్సిన్‌ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో కరోనా వ్యాక్సిన్‌ కొరకు తీసుకోవల‌సిన చర్యల‌పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతవరకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, హెల్త్‌ కేర్‌ ఉద్యోగుల‌కు కరోనా వ్యాక్సిన్‌ అందజేశామని, మార్చి 1 నుండి సాధారణ ప్రజల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి మరియు 45 సంవత్సరాలు దాటి వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా వ్యాక్సిన్‌ అందించాల‌ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని పేర్కొన్నారు.

సోమవారం నిజామాబాదు లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ప్రైవేట్‌ ఆస్పత్రులైన ప్రగతి ఆస్పత్రి, మెడికవర్‌ ఆసుపత్రుల‌ను ఎంపిక చేయడం జరిగిందని, సోమవారం నుండి ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగాను ప్రైవేట్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ ఖరీదు 150 రూపాయలు, ఇతర సేవా ఖర్చులు వంద రూపాయలు మొత్తంగా 250 రూపాయలు మించకుండా చెల్లించి వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని ఆయన తెలిపారు. మొదటిరోజు అనగా సోమవారం వ్యాక్సిన్‌ తీసుకోవానుకొనే వారు ఆన్‌ లైన్‌ ద్వారా యాప్లో తమ మొబైల్‌ నెంబర్‌ నమోదు చేయడం ద్వారా ఇతర వివరాలు అందించి వారి పేరును రిజిస్టర్‌ చేసుకున్న వారు మాత్రమే ఆసుపత్రుల‌కు రావాల‌ని వివరించారు.

వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చేవారు 60 సంవత్సరాలు దాటిన వారైతే ఆధార్‌ కార్డు వెంట తీసుకు రావాల‌ని, 45 సంవత్సరాలు దాటిన వారు వారి ఆరోగ్య సమస్యల‌కు సంబంధించి వైద్య ధ్రువ పత్రం కూడా చూపించి వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని తెలిపారు. వీరితో పాటు ఇంతకు ముందు ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు, హెల్త్‌ కేర్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ అందించిన వారిలో మొదటి డోస్‌ కానీ రెండవ డోస్‌ కానీ తీసుకోని వారికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో రోజుకు కనీసం 200 మందికి తగ్గకుండా వ్యాక్సినేషన్‌ చేయాల‌ని ఆయన ఆదేశించారు.

వ్యాక్సినేషన్‌కు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఆయా ఆస్పత్రుల‌లో అవసరమైన ఇతర ఏర్పాట్లు, సౌకర్యాలు, సదుపాయాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మందులు, అత్యవసర సేవ‌లు సిద్ధం చేసుకోవాల‌ని ఆసుపత్రుల‌ యాజమాన్యాల‌ను ఆయన ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో అందించే వ్యాక్సినేషన్‌ కు డిఎం అండ్‌ హెచ్‌వో, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో పర్యవేక్షణ చేయాల‌ని సూచించారు. సెల్‌ కాన్ఫరెన్సులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో తుకారాం, ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తాగునీటికి అంతరాయం కల‌గకుండా చూడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల‌ తాగునీటికి అంతరాయం కల‌గకుండా అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా ...

Comment on the article