Breaking News

ఓటర్ల జాబితా సిద్ధం చేయండి

నిజామాబాద్‌, మార్చ్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీల‌లో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డ్‌ మెంబర్లు‌ పదవుల‌ను ఎన్నికల‌ ద్వారా భర్తీ చేయుటకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాల‌ని రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌ సి పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు.

మంగళవారం ఆయన హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డ్‌ మెంబర్‌ ఎన్నికల‌కు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉన్నందున అందుకు ముందుగా ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇందుకు ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీల‌లో సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్‌ వారీగా వాటి పరిధిలో ఓటర్ల జాబితా సిద్ధం చేయాల‌ని ఆదేశించారు.

ఇందుకుగాను ముందుగా ఏప్రిల్‌ మూడవ తేదీన డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా ముద్రించాల‌ని ఆరవ తేదీన జిల్లా స్థాయిలో, ఏడవ తేదీన మండల‌ స్థాయిలో రాజకీయ పార్టీల‌ ప్రతినిధుల‌తో సమావేశం ఏర్పాటు చేయాల‌ని, నాలుగో తేదీ నుండి 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించాల‌ని, పదవ తేదీన అభ్యంతరాల‌ను పరిశీలించి డిస్పోజ్‌ చేయాల‌ని, 12వ తేదీన ఫైనల్‌ ఓటర్ల జాబితా ముద్రించి సంబంధిత ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలు, వార్డులో జాబితాను ప్రదర్శించాల‌ని ఆయన సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్‌ జిల్లాలో ఇందల్వాయి మండలంలోని గంగారం తండా, తిర్మన్‌ పల్లి, భీమ్గల్‌ మండలం బాచన్పల్లి, మాక్లూర్‌ మండలం సాత్లాపూర్‌ తాండలో మొత్తం 4 సర్పంచ్‌ పదవులు, జిల్లా వ్యాప్తంగా 76 వార్డ్‌ మెంబర్‌ పదవులు ఖాళీగా ఉన్నాయని, ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, మెటీరియల్‌ సిద్ధం చేసుకోవాల‌ని ఆదేశించడం జరిగిందని వివరించారు. అవసరమైన ఇతర అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ తదితరులు హాజరయ్యారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article