డిచ్పల్లి, ఏప్రిల్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశోధనలతోనే మేలైన సాహిత్య వికాసం జరుగుతుందని ప్రముఖ జానపద పరిశోధకులు, జానపద సాహిత్య లబ్ద ప్రతిష్టులు, ప్రావీణ్యులు, మైసూర్ విశ్వవిద్యాలయంలో విశ్రాంతాచార్యులు ఆచార్య ఆర్వీయస్ సుందరం పేర్కొన్నారు. మైసూర్ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ‘‘ఆంధ్రుల జానపద విజ్ఞానం’’ అనే అంశంపై పరిశోధించి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.
ఆ గ్రంథం అన్ని తెలుగు విభాగాలలో జానపద సాహిత్య పాఠ్య గ్రంథంగా ప్రసిద్ధి పొందింది. జానపద పరిశోధకులకు మొట్ట మొదటి రిఫరెన్స్ గ్రంథంగా, ఉపయుక్త గ్రంథంగా ఆధారపడుతున్నది. మైసూర్ విశ్వవిద్యాలయంలోనే సుదీర్ఘ కాలం ఆచార్యులుగా చేశారు. అటువంటి మహా వ్యక్తిత్వ జానపద సాహిత్య పునరుజ్జివనకర్త ఆచార్య ఆర్వీయస్ సుందరం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖను బుధవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. తెలుగు అధ్యయనశాఖ వారికి అపూర్వ స్వాగతం పలికింది. ఆయన వెంట మనుమరాలు పవిత్ర వచ్చారు.
ఆమె హంపీ విశ్వవిద్యాలయంలో తెలుగు, కన్నడ దళిత కథా సాహిత్యం మీద పరిశోధన చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆచార్య పి. కనకయ్యను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో జరుగుతున్న సాహిత్య సేవను, పరిశోధనలను గూర్చి ప్రశంసించారు.
తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులు ఆచార్య కనకయ్య, డా. బాల శీనివాస మూర్తి, డా. త్రివేణి, డా. లావణ్య, డా. లక్ష్మణ చక్రవర్తి బోధనా పటిమ, సాహిత్య నిబద్ధత గూర్చి, వారు వెలువరిస్తున్న పుస్తక ప్రచురణను గూర్చి వెనువెంటనే తనకు తెలుస్తుంటాయని అన్నారు. తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులందరు ఆర్వీయస్ సుందరంని గూర్చి తమ తమ వ్యక్తిగత సాహిత్య పరిశోధక అనుభవాలను తెలిపారు. అనంతరం తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులు, పరిశోధకులు ఘనంగా సన్మానించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు - April 16, 2021
- నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ - April 16, 2021
- మహిళల భద్రతకై క్యూ.ఆర్.కోడ్ - April 16, 2021