Breaking News

మోర్తాడ్‌లో కుంటను మింగిన పెద్దలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పంట పొలాల‌కు సాగునీరు అందించే ఇప్ప కుంటను గ్రామానికి చెందిన కొందరు రైతులు గత కొన్నాళ్ల నుండి కబ్జా చేసుకొని పంటలు పండించుకుంటున్నప్పటికీ రెవెన్యూ ఇరిగేషన్‌ శాఖల‌ అధికారుల‌కు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన ఇప్ప కుంటను ప్రభుత్వ అధికారులు చూసి కూడా చూడనట్టుగా వ్యవహరించడం ఏమిటని ప్రజలు అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటల‌ను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని నింపి త్రాగు నీరు సాగునీరు అందించేందుకు సిద్ధం చేయాల‌ని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాల‌ను బేఖాతరు చేస్తూ కుంటల‌ను కబ్జా చేసుకున్న వారికి వత్తాసు పలుకుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల‌ క్రితమే ఇప్ప కుంటను కబ్జా చేసుకొని అందులో పంటలు పండించుకోవడం వ‌ల్ల‌ కుంట క్రింద గల‌ ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని దీనివ‌ల్ల‌ ఆయకట్టు సాగు కొరకు గ్రామంలోని ముసల‌మ్మ చెరువు నీటిపై ఆధారపడి ఆ నీరు వచ్చే వరకు చూడాల్సి వస్తుందని అంటున్నారు.

ఏది ఏమైనా ఆయా గ్రామాల‌లోని చెరువు కుంటను పరిరక్షించే బాధ్యత రెవెన్యూ ఇరిగేషన్‌ శాఖపై ఉందని కానీ ఈ శాఖ అధికారులు మాత్రం చెరువు కుంటల‌ను ఎవరంటే వారు కబ్జా చేస్తుండగా చూస్తూ ఊరుకోవడం ఏమిటని స్థానిక ప్రజలు అంటున్నారు. ఈ ఇప్ప కుంట ప్రభుత్వ రికార్డుల‌ ప్రకారం దాదాపుగా 16 ఎకరాల‌ వరకు ఉంటుందన్నారు.

కుంటలో అధికారులు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సహాయంతో నీటిని నింపినచో ఆయకట్టు పొలాల‌కు నీరు అందించడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో గల‌ బోరు బావుల‌లో నీటి నిలువ‌ ఉండే అవకాశం ఉందని ప్రజాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే కుంటను సర్వే చేయించి కుంటలో నీటిని ఆదుకోవాల‌ని స్థానిక ప్రజలు అధికారుల‌ను కోరుతున్నారు.

Comment on the article