Breaking News

స్వీయ నియంత్రణ, మాస్కు దరించడమే శ్రీరామ రక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత సమావేశపు హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని పలు నిర్ణయాల‌ను మంత్రి మీడియాకు వెల్ల‌డించారు. కోవిడ్‌ రెండవ దశలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల‌ మేరకు ప్రధానంగా నాలుగు అంశాల‌పై చర్చించారు.

జిల్లాలో అధిక సంఖ్యలో కొవిడ్‌ పరీక్షలు చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం అందించడం, కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయడం 4 అంశాలు సమాంతరంగా అమల‌య్యేందుకు తీసుకోవాల్సిన చర్యల‌పై చర్చించారు. జిల్లాలో 29 పరీక్షా కేంద్రాల‌లో ప్రతి రోజు 3,000 వరకు కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని, పరీక్ష విషయంలో సంతృప్తికరంగానే ఉన్న ట్రీట్మెంట్‌ ఇంకా మెరుగు పర్చాల‌ని అధికారుల‌ను అదేశించామన్నారు.

కరోనా రెండవ దశలో జిల్లాలో 1 ల‌క్ష 50 వేల‌ మందికి పరీక్షలు చేయగా 4,000 కేసులు ఆక్టివ్‌లో ఉన్నాయని, అందులో 50 మంది ప్రభుత్వ ఏరియా, జిల్లా హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారన్నారు. మిగతావారు వైద్యుల‌ సూచన మేరకు హోమ్‌ ఇసొలేషన్‌లో ఉన్నారని, జిల్లాలో ఇప్పటికే 40 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని, మరో 90 బెడ్ల ఏర్పాటుకు బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో 50, దోమకొండ పిహెచ్‌సిలో 10, మద్నూర్‌ 10, ఎల్లారెడ్డి లో 10 ఆక్సిజన్‌ బెడ్లు పెంచాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు.

మొత్తం 140 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేశామని, జిల్లాలో మందులు, ఇంజక్షన్‌ కొరత లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెమిడేసివిర్‌ ఇంజక్షన్‌ కొరత ఉన్నదని డిఎంహెచ్‌ఓ తమ దృష్టికి తీసుకువచ్చారని, టీకాలు, ఇంజక్షన్‌ కొరత లేకుండా చూడాల‌ని రాష్ట్ర అధికారుల‌తో మాట్లాడామని, ఎలాంటి కొరత ఉండదన్నారు. ట్రీట్మెంట్‌ సక్రమంగా అందించండని, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామన్నారు. దానికి అవసరమైన నిధులు మంజూరు చేసామని, జిల్లాలో 30 వాక్సినేషన్‌ కేంద్రాల‌ ద్వారా 2.30 ల‌క్షల‌ మందికి వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక ల‌క్ష మందికి అనగా 44 శాతం టీకా వేసి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందన్నారు.

జిల్లాలో రోజుకూ 4 వేల‌ నుండి 5 వేల మందికి టీకా వేస్తున్నామని, వ్యాక్సినేషన్‌ కోసం సిబ్బంది కొరత ఉన్నందున కొంత మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడిన నేపథ్యంలో తాత్కాలిక పద్దతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌ నర్స్‌, మెడికల్‌ ఆఫీసర్లను అవసరమైన మేరకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో నియమించుకోవాల‌ని అదేశించామన్నారు.

అలాగే రెవెన్యూ, పోలీసు విభాగాల‌తో ఎన్‌ఫోర్సుమెంట్‌ టీమ్‌ ఏర్పాటు చేసి మహారాష్ట్ర బార్డర్‌లో రాకపోకల‌పై నిఘా ఏర్పాటు చేసామని, తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకురండని, మార్కెట్‌, కిరాణా, జనరల్‌ షాపు, విక్రయాల‌ షాపుల్లో తప్పనిసరిగా మాస్కు వాడి, సానిటైజర్లు వినియోగించాల‌న్నారు. ప్రభుత్వ కోవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై ప్రజ ఆరోగ్య దృష్ట్యా పోలీసు వారిని కఠిన చర్యలు తీసుకోవాల‌ని అదేశించామని, మాస్కు లేకుంటే జరిమానా వేస్తారని, మాస్కు దరించడమే శ్రీరామ రక్ష అన్నారు.

చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఇంట్లో కూడా మాస్క్‌ ధరించాల‌న్నారు. చిన్న పిల్ల‌ల‌ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల‌ని, కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నందున సరిహద్దు గ్రామాల్లో తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చేతుల‌ను శుభ్రంగా ఉంచుకోవాల‌ని, కోవిడ్‌ ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల‌ చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా దానికి సహకరించాల‌ని చేతులెత్తి నమస్కరిస్తున్న అని మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

సమావేశంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు బీబీ పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంతు షిండే, జడ్పీ చైర్‌ పర్సన్‌ శోభా, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, జిల్లా కలెక్టర్‌ శరత్‌, స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పలువురు రెవెన్యూ, పోలీసు విభాగాల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article