Breaking News

కోవిడ్‌ సేవల‌పై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, మే 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఊహించకుండానే విరుచుకుపడి ప్రజల‌ను భయాందోళనకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్న కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల‌ మేరకు మంత్రిగా తాను, జిల్లా కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని సేవల‌ను మెరుగు పరచడంతో పాటు సదుపాయాల క‌ల్ప‌నకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రుల‌లోనూ అదేవిధంగా నిజామాబాద్‌ లోని కరోనా పేషెంట్లకు స్థానిక శాసనసభ్యులు గణేష్‌ గుప్తా ఆధ్వర్యంలో ఉచితంగా అందించే భోజనం సిద్ధం చేస్తున్న ఫంక్షన్‌ హాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ముందుగా ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించి రోగుల‌తో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రికవరీ రేటు బాగుందని, శాసనసభ్యులు జీవన్‌ రెడ్డి కోరికమేరకు ఆస్పత్రిలోని 100 పడకల‌కు యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

తద్వారా ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల‌లోని ప్రజల‌కు కరోనా చికిత్స కొరకు ఆసుపత్రి అనుకూలంగా, అందుబాటులో ఉంటుందని ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని , ప్రజలు ప్రైవేట్‌ ఆస్పత్రుల‌లో డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకోవాల‌ని, అవసరమైన ఇంజక్షన్లు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

నిజామాబాదులో ….

నిజామాబాదులోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో మంత్రి వేముల‌ పర్యటించి వార్డులో కలియతిరిగి కోవిడ్‌ పేషెంట్లను ఆత్మీయంగా పల‌కరిస్తూ మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళతారని మనోధైర్యాన్ని నింపారు. మీ ఆరోగ్యాలు చూసి రమ్మని ముఖ్యమంత్రి నన్ను పంపారని ప్రభుత్వం మీకు అన్ని విధాల‌ అండగా ఉంటుందని భరోసా అందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కరోనా సోకిన మన దగ్గర బంధువుల‌ దగ్గరికి వెళ్లడానికే మనం భయపడతామని కానీ నర్సింగ్‌, శానిటేషన్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌లు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు 24 గంటలు పనిచేస్తూ వారి ప్రాణాల‌ను సైతం ఫణంగా పెట్టి సుమారు 400 మంది రోగుల‌కు సేవ‌లు అందిస్తున్నారని వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు ఒత్తిడిలో కూడా సొంత వ్యక్తుల‌ కంటే బాగా కమిట్మెంట్తో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. తాను, కలెక్టర్‌ ప్రతి రోజు కూడా కరోనా పేషెంట్లకు సమకూర్చే సదుపాయాలు, సేవల‌పై చర్చించుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు.

పేషెంట్లు వారి బంధువులు సామరస్యంగా ఉండాల‌ని సూచించారు ప్రభుత్వం వంద శాతం శక్తిమేర పేషెంట్లను వైరస్‌ నుండి కాపాడడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో మరిన్ని వెంటిలేటర్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక శాసనసభ్యులు తన తండ్రి జ్ఞాపకార్థం కరోనా రోగుల‌కు ఉచితంగా భోజనం అందిస్తున్న అర్వపల్లి పురుషోత్తం ఫంక్షన్‌ హాల్‌లో పర్యటించి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమమని ఎమ్మెల్యే ప్రజల‌ పక్షాన నిల‌బడి రోజుకు పదిహేను వందల‌ మందికి ఉచితంగా భోజనాలు అందించడం ఎంతైనా ప్రశంసనీయమని ఇది ఖర్చు, కమిట్మెంట్తో కూడుకున్న ఒక గొప్ప సేవా కార్యక్రమం అని ఆయన ప్రశంసించారు. మంత్రి వెంట కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఆర్మూర్‌ శాసనసభ్యులు జీవన్‌ రెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ ...

Comment on the article