Breaking News

తగ్గుతున్న వైరస్‌ వ్యాప్తి, కేసులు

నిజామాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కేసులు 25 నుండి పది శాతానికి తగ్గాయని, వైరస్‌ వ్యాప్తి కూడా తగ్గుతున్నదని, ఆసుపత్రుల‌లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్డెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తుల‌ను గాంధీ, కోఠి లోని ఈఎన్‌టి ఆసుపత్రుల‌కు పంపించాల‌ని, లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో మార్కెట్లలో రద్దీని తగ్గించడానికి మరిన్ని తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయాల‌ని, రెస్టారెంట్లు, హోటల్‌లో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించుకోవాల‌ని టిఫిన్‌ సెంటర్లలో టేక్‌ అవే మాత్రమే కొనసాగించాల‌ని, వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీసుకున్న ఇంటింటి సర్వే అదేవిధంగా లాక్‌డౌన్‌ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

గురువారం ఆయన కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో స్థానిక శాసనసభ్యులు గణేష్‌ గుప్తా, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, ల‌త, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రుల‌ సూపరింటెండెంట్స్‌, ఆర్‌డివోలు, ఇతర శాఖల‌ అధికారుల‌తో కోవిడ్‌ వైరస్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయంలో వంద మందికి టెస్టు చేయగా 25 మందికి పాజిటివ్‌గా వచ్చిందని గత సమీక్ష సందర్భంగా అది 15 శాతానికి తగ్గిందని, ప్రస్తుతం పది శాతానికి వచ్చిందని ఇందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్‌, ప్రజాప్రతినిధుల‌కు ఇతర శాఖల‌ అధికారుల‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు.

తద్వారా ఆస్పత్రుల‌లో ప్రస్తుతం పడకలు కూడా అందుబాటులో ఖాళీగా ఉన్నాయని ఆక్సిజన్‌ ఇంజెక్షన్‌ అవసరం కూడా చాలా వరకు తగ్గిందని దీన్నిబట్టి కేసులు తగ్గుతున్నట్టు అర్థమవుతుందన్నారు. పీక్‌ సమయంలో రోజుకు పదహారు వందల‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం కాగా ప్రస్తుతం 800 సరిపోతున్నాయి అన్నారు. ఇదేవిధంగా కృషి చేస్తే త్వరలోనే పాజిటివ్‌ కేసులు సున్నాకు పరిమితం అవుతాయని తాను ఆశిస్తున్నానని తెలిపారు.

ఇంజక్షన్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల‌లో 10,000, ప్రైవేటు ఆసుపత్రుల‌లో నాలుగు వేల‌ ఆరు వందలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి సంబంధించి మందుల‌ కొరత వ‌ల్ల‌ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రికి లేదా కోఠి లోని ఈ.ఎన్‌.టి. ఆసుపత్రుల‌కు పంపించాల‌ని త్వరలోనే మందులు రాగానే ఇక్కడ కూడా చికిత్సకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ వారు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి మందుల‌ కొరకై ప్రభుత్వం జారీచేసిన ప్రొఫార్మా ప్రకారము దరఖాస్తు చేయాల‌ని అదేవిధంగా నమూనాను వారి వారి ఆసుపత్రుల‌లో ప్రదర్శించాల‌ని సూచించారు.

ఇంటింటి సర్వే సందర్భంగా గుర్తించిన పాజిటివ్‌ వచ్చినవారికి మందులు అందించడంతో వారు కోలుకుంటున్నారని తెలిపారు. లాక్‌ డౌన్‌ సమయం సడలింపు సందర్భంగా కూరగాయల‌ మార్కెట్‌లో రద్దీ తగ్గించడానికి బోధన్‌ ఆర్మూర్‌ నిజామాబాద్‌ శాసనసభ్యుల‌ సూచన మేరకు మరిన్ని తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయాల‌ని ఆయన అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా రెస్టారెంట్లు, హోటల్‌లో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి సీటింగ్‌ కెపాసిటీ 50 శాతానికి పరిమితం చేయాల‌ని టిఫిన్‌ సెంటర్లలో అక్కడే టిఫిన్‌ చేసే బదులు ఇంటికి తీసుకుపోయే విధంగా పరిమితం చేయాల‌ని ఈ దిశగా పోలీస్‌ అధికారులు, ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ ఇతర అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ప్రస్తుతం టీకా సరఫరా లేనందున కేంద్ర ప్రభుత్వ అనుమతితో గ్లోబల్‌ టెండర్ల ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని అవి రాగానే ప్రజల‌కు అందిస్తామన్నారు. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి, వైరస్‌ సోకిన ప్రజల‌కు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని అయితే దానిని తమ దరికి రానీయకుండా ప్రజలు బయటకు వెళితే డబుల్‌ మాస్కు ధరించాల‌ని, కనీస దూరం పాటించాల‌ని, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాల‌ని తద్వారా ఎవరికి వారు రక్షణ పొందగలుగుతారు అని కోరారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాల‌ నరేంద్ర, ప్రభుత్వ ఆసుపత్రుల‌ సూపరింటెండెంట్స్‌, వైద్యాధికారులు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article