Breaking News

నిజామాబాద్‌ జిల్లా పాలనా ప్రాదేశిక వ్యవస్థీకరణ – అభివృద్ధి పరంపర

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం
ఎస్. శర్మ

కామారెడ్డి:
నిజామాబాద్‌ జిల్లా 1952 రాష్ట్ర పునర్వవ్యస్థీకరణలో పలు మార్పులకు లోనైంది. అప్పటి వరకు నాందేడ్‌, నిర్మల్‌, దెగ్లూర్‌, బైంసా ప్రాంతాలను నిజామాబాద్‌ నుంచి తొలగించి మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విలీనం చేశారు. అప్పట్లో 7 తాలూకాలుగా నిజామాబాద్‌, బాన్సువాడ, బోధన్‌, ఆర్మూర్‌, మద్నూర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి కేంద్రాలతో ఏర్పాటు అయింది. 1979లో తాలూకాల పునర్వవ్యస్థీకరణలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు మరో రెండు తాలూకాలుగా దోమకొండ, భీంగల్‌ ఏర్పాటయ్యాయి.

1956లో పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటై జిల్లాలో నిజామాబాద్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, భీంగల్‌, బోధన, దోమకొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మద్నూర్‌ పంచాయితీ సమితి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో సమితి పరిధిలో 60 నుంచి 70 గ్రామాలు వుండేవి. 1985లో రాష్ట్ర ప్రభుత్వం మాండలిక రాజ్యాంగ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానంలో జిల్లాలోని 9 తాలూకాలు, 9 పంచాయితీ సమితీలను 35 మండల రెవెన్యూ మండలాలు, 35 మండల పరిషత్‌లను ఏర్పాటు చేశారు.

అప్పట్లో మండల పరిషత్‌లకు అధ్యక్షులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం విశేషం. ఇప్పటికే జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌ డివిజన్‌లలోని గ్రామాలను నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి కేటాయించి కామారెడ్డి డివిజన్‌లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ తాలూకాలను మాత్రం మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గానికి కేటాయించారు.

అంతకు పూర్వం కామారెడ్డి ప్రాంతాన్ని కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలో అంతర్భాగంగా వుండేది. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో నిజామాబాద్‌, బోధన్‌, జుక్కల్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బాల్కొండ, డిచ్‌పల్లి శాసనసభా నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాలు మెదక్‌ పరిధిలోకి చేరాయి. కొత్తగా ఎడపల్లి పేరుతో రెవెన్యూ మండలం, మండల పరిషత్‌లను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 36వ మండలం ఏర్పాటైంది. దీంతో ఈ జిల్లా రాజకీయ ముఖచిత్రం మార్పు చేర్పులకు గురైంది. ఇటీవల జరిగిన పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణలో నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌లతో పాటు కరీంగనగర్‌ జిల్లా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు చేరిపోయాయి.

కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్లను నూతనంగా ఏర్పాటు చేసిన జహీరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో చేర్చారు. దీంతో పాటు జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాలను కూడా జహీరాబాద్‌లో కలిపారు. ఇటీవల రెవెన్యూ మండల అధికారుల హోదాను తహసీల్దార్‌గా మార్చారు. జిల్లాలో ప్రస్తుతం 953 గ్రామాలు, 800పైగా గ్రామపంచాయితీలు పనిచేస్తున్నాయి. జిల్లాలో నిజామాబాద్‌ తొలుత సెలక్షన్‌గ్రేడ్‌ మున్సిపాలిటీగా వుండేది. ఇటీవల కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగి గత ఐదేళ్ల క్రితం మేయర్‌ పదవి కాంగ్రెస్‌ ఖాతాలో జమైంది. అదే విధంగా బోధన్‌, కామారెడ్డి గ్రేడ్‌-2 మున్సిపాలిటీలుగా వున్నాయి. గ్రామ పంచాయితీగా వున్న ఆర్మూర్‌ మున్సిపాలిటీ హోదాను పొందింది.

ఇంకా జిల్లాలో బాన్సువాడ, ఎల్లారెడ్డి గ్రామ పంచాయితీలుగానే కొనసాగుతున్నాయి. అవి కూడా మున్సిపల్‌ హోదాకు చేరువయ్యాయి. జిల్లాలో అర్బన్‌ ప్రాంతంగా శ్రీరాంసాగర్‌ మాత్రమే కొనసాగుతుంది.

ఇదిలా వుండగా భారత తొలి ప్రధాని పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ ప్రథమ పంచవర్ష ప్రణాళికలలో భాగంగా బాల్కొండ మండలం పోచంపాడ్‌ వద్ద గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నిజామాబాద్‌ అన్నపూర్ణగా ఎదిగేందుకు ప్రారంభించిన పథకం క్రమేణా కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాలకు వరప్రదాయినిగా మారింది. ఈ ప్రాజెక్టు పనుల కొనసాగింపుగా 20 ఏళ్ల క్రితం వరద కాలువ పనులకు అప్పటి ప్రధాని పివి నర్సింహారావు శంకుస్థాపన చేయడం విశేషం. జిల్లాలో సాగునీటి విస్తీర్ణం పూర్తిగా నిజాంసాగర్‌, అలీసాగర్‌ ఆయకట్టు ప్రాంతాల్లోనే వుండగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద జిల్లాకు చెందిన వ్యవసాయ భూమి కేవలం బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ మండలాలకే పరిమితమైంది. దీంతో జిల్లాలో భారీ ప్రాజెక్టుల కింద సాగయ్యే భూమి విస్తీర్ణం చెప్పుదగినంత లేదు.

చిన్న నీటి వనరులు కుంటలు చెరువుల కింద సాగయ్యే భూమితో పాటు బోరుబావులు, వర్షాధార పంటలకు మాత్రమే పరిమితమైంది. కౌలాస్‌ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే వుంది. కళ్యాణి ప్రాజెక్టులో వందల ఎకరాల్లో సాగవుతుంది. ఇదిగాక జిల్లాలో పోచారం ప్రాజెక్టు కింద పది వేల ఎకరాల్లో సాగు అవుతోంది. పోచారం అభయారణ్యం ఒకప్పుడు నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి మండలాలకు విస్తరించగా ప్రస్తుతం కనుమరుగైంది. దీంతో జిల్లాలో ఒకప్పుడు గంతులేసిన వణ్యప్రాణులు ఉనికి లేకుండా పోయాయి. జిల్లాలో నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల కింద రెండు మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి నిర్దేశించిన ప్రాజెక్టులు సైతం వెలవెల పోతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్‌ ఉత్పత్తి లభిస్తే జిల్లా అవసరాలకు సరిపోతుంది. జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమలేవీ లేవు.

గతంలో నిజాం పాలనలోనే బోధన్‌ శక్కర్‌నగర్‌ పేరుతో ఆసియా ఖండంలోనే పేరుమోసిన చక్కెర కర్మాగారం నెలకొల్పిన ఘనత ఆనాటి పాలకులకే దక్కింది. అయితే 1995లో ఈ కర్మాగారాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. దీంతో ఈ కర్మాగారం సైతం ఖాయిలా పడిపోయింది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వం ఆదీనంలోకి తీసుకునేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి సానుకూల నిర్ణయం తీసుకున్నా ఇంకా అది అమలులోకి రాలేదు. అదే విధంగా కామారెడ్డి సమీపంలోని టేకిర్యాల వద్ద ఆల్కోహాల్‌ ఫ్యాక్టరీ సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కామారెడ్డి సమీపంలోనే ప్రైవేటు రంగంలో భారీ చక్కెర పరిశ్రమ గాయత్రీ షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. గతంలో జిల్లాలో స్టార్చ్‌ ఫ్యాక్టరీ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది ఖాయిలా దశకు చేరుకుంది. అదే విధంగా రెంజల్‌ మండలం నీలాలో కాగితం పరిశ్రమ దశాబ్దం క్రితమే కనుమరుగైంది. భిక్కనూరు మండలం రైల్వే స్టేషన్‌ వద్ద గ్రానైట్‌ ఫ్యాక్టరీ మాత్రం పనిచేస్తుంది. ఇటీవల జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి తీసుకున్న చర్యలేవీ పెద్దగా ఫలితాన్ని సాధించలేకపోయాయి.

కానీ రియల్‌ ఎస్టేట్‌ భూంతో జిల్లా సరిహద్దు మండలాలైన భిక్కనూరు ప్రాంతంలో పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమై పోయాయి. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రోత్సాహం లభించకపోవడం, నేతల కునికిపాట్లతో జిల్లా పారిశ్రామిక రంగం ముఖచిత్రం ఆశావహంగా లేదు. 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ఆర్మూర్‌ ప్రాంతంలోని జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌ వద్ద సర్వే చేసింది. సర్వే పూర్తయి దశాబ్ద కాలం గడిచినా ఇంకా శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు.

రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో కేవలం రెండున్నర గంటల ప్రయాణంలో చేరుకునే జిల్లా నిజామాబాద్‌ పారిశ్రామిక రంగం బోసిపోయింది. ఇదే దశలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వరంగంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చెప్పుకోదగ్గది. జిల్లా కేంద్రంలో వున్న ఆసుపత్రి స్థాయి పెంచి 500 పడకలకు అభివృద్ధి పర్చి వైద్య కళాశాల నెలకొల్పడం విశేషం. దీంతో జిల్లా వైద్యవిద్యలో ఒక ముందడు వేయగలిగింది. ప్రైవేటు రంగంలో పలు ఇంజనీరింగ్‌ కళాశాలలు నెలకొల్పినప్పటికీ జిల్లాలో ఇంజనీరింగ్‌ విద్య ప్రభుత్వపరంగా పాలిటెక్నిక్‌ కళాశాలతో డిప్లమోకే పరిమితమైంది. దీన్ని ఇంజనీరింగ్‌ కళాశాలగా అభివృద్ధి పర్చడంలో జిల్లా నాయకులెవరూ శ్రద్ధ కనబర్చలేదు. పక్కన వున్న మెదక్‌ జిల్లాలో అక్కడి నేతలు ముందుకు వచ్చి జెఎన్‌టియు కళాశాలను నెలకొల్పుకోగలిగారు.

జిల్లాలో 2009లో డిచ్‌పల్లి సమీపంలో నెలకొల్పిన యూనివర్సిటీ మాత్రమే చెప్పుకోదగ్గ విద్యాభివృద్ధి అనవచ్చు. అయితే ఈ వర్సిటీలో పేరుమోసిన కోర్సులేవీ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. పరిశోధనలకు వేదికగా ఈ వర్సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చడంతో పాటు ఇంజనీరింగ్‌ విద్యను పెంపొందించాల్సిన అవసరం వుంది. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి వేలాది కుటుంబాలు బొంబాయి, బీమండి, షోలాపూర్‌, గుజరాత్‌, దుబాయి, గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు.

స్థానికంగా ఉపాధి వనరులు మృగ్యమైపోవడంతో పాటు వ్యవసాయం దుర్భరం మారడం, దీనికి తోడు చేనేత వృత్తి కనుమరుగై పోవడంతో జిల్లాకు శాపంగా మారింది. ఆయా వృత్తుల్లో వున్న కుటుంబాలు ఇక్కడ ఉపాధి లభించక వివిధ ప్రాంతాల్లో వలస వెళ్లి ఇతర వృత్తుల్లో స్థిరపడుతున్నారు. దీంతో జిల్లాలో వందలాది గ్రామాలు కళావిహీనంగా వున్నాయి. జిల్లాలో 25 లక్షల జనాభా అవసరాలకు సరిపడా మౌళిక వసతులు సమకూర్చడంలో జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది.

విద్య, వైద్య, రవాణా, విద్యుత్‌ తదితర రంగాల్లో సంపూర్ణ స్వాలంబన సాధ్యం కాకపోవడంతో జిల్లా అభివృద్ధి నత్తనడకన కొనసాగుతుంది. అధికారిక అంచనాల్లో జిల్లా ఒకప్పుడు ఒకట్ల స్థానంలో వుంటే ప్రస్తుతం చివరి స్థానాల్లో కొనసాగడం విశేషం. జిల్లా అభివృద్ధిలో తీసుకోవాల్సిన అనేక అంశాలపై జిల్లా యంత్రాంగం తగిన దృష్టి సారించాల్సిన అవసరం వుంది. నిజామాబాద్‌ జిల్లా ఒకవైపు మహారాష్ట్ర సరిహద్దుగా వుండడంతో జిల్లా కేంద్రం భిన్న వ్యక్తుల కలయికకు వేదికగా వుంది. జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తున్నారు.

జిల్లా కేంద్రంలో సైతం పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రేనేజీ, విద్యుత్‌, తదితర ఏర్పాట్లలో నిర్లక్ష్యం ద్యోతకమవుతుంది. వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా వుండే నిజామాబాద్‌, కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ బస్టాప్‌లు మరింత కొత్త హంగులతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వుంది. జిల్లాలో సుమారు వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించే వెసులుబాటు జాతీయ రహదారి కల్పిస్తుంది. ఇటీవలే ఇది నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి పర్చినా పలు చోట్ల ప్రమాదాలకు ఇంకా తగిన జాగ్రత్తలు చేపట్టలేదు.

ప్రణాళికాబద్దంగా లేని కారణంగానే ఈ జాతీయరహదారి నరకకూపంగా మారింది. జిల్లా కేంద్రం నుంచి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట వరకు వున్న జిల్లా రహదారి సైతం ప్రమాదాలకు వేదికగా మారింది. మరో జాతీయ రహదారి నిజామాబాద్‌-జగ్దల్‌పూర్‌ రోడ్డు సైతం ప్రమాదాల నిలయంగా మారింది. నవీపేట, వర్ని, భీంగల్‌, ధర్పల్లి తదితర రహదార్లు సైతం గోతులతో నిండిపోయాయి. అంతర్‌జిల్లా రోడ్లను మరమ్మత్తులు చేయడంలో రోడ్లు భవనాల శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తద్వారా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదాలకు గురైన వారికి వైద్య సహాయం కూడా అందుబాటులో లేకపోవడం శోచనీయం. సమీపంలోని ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించడం ఆలస్యం కావడంతో ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సి వస్తుంది.

జిల్లా అభివృద్ధిలో ఏరియా ఆసుపత్రులను విస్తరించి ఆధునాతన భవనాల నిర్మాణం చేపట్టారు. అదే విధంగా అన్ని హంగులతో కూడిన పరికరాలను సమకూర్చినప్పటికీ అందుబాటులో అవసరమైన వైద్యులు లేకపోవడం గమనించదగ్గ అంశం. వివిధ రోగాలకు సంబంధించిన వైద్య నిపుణుల కొరత తీవ్రంగా వుంది. వారిని నియమిండంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఈ జిల్లాలో వేలాది మంది రోగులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లి వ్యయప్రయాసలకు గురవుతున్నారు. విద్యుత్‌ రంగంలో 1964 ప్రాంతంలో జిల్లాలో తొలిసారిగా విద్యుత్‌ బల్పు వెలిగింది.

కానీ వందశాతం విద్యుద్దీకరణలో ఇంకా వెనుకంజలోనే వున్నాం. ప్రధానంగా వ్యవసాయ రంగంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువ గృహ రంగంలో సైతం విద్యుత్‌ వినియోగం విస్తృతం అయినప్పటికీ అవసరాలకు తీర్చుకునేందుకు జిల్లాలో విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలు నెరవేరడం లేదు. జిల్లాలో ఇప్పటికే రెండు జలాశయాల్లో విద్యుత్‌ కేంద్రాలున్నా వాటిని పూర్తిస్థాయి ఉత్పత్తి కేంద్రాలుగా అభివృద్ధి పర్చుకుంటే జిల్లా అవసరాలు తీరేందుకు దోహదపడతాయి.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article